Nagarjuna Sagar : టెన్షన్ టెన్షన్.. సీఆర్‌పీఎఫ్ బ‌ల‌గాల ఆధీనంలోకి సాగ‌ర్ డ్యామ్.. తెలంగాణ పోలీసులపై కేసు నమోదు

నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న తాజా వివాదం పరిష్కారానికి కేంద్రం సిద్ధమైంది. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల ఆపరేషన్ అంతా

Nagarjuna Sagar : టెన్షన్ టెన్షన్.. సీఆర్‌పీఎఫ్ బ‌ల‌గాల ఆధీనంలోకి సాగ‌ర్ డ్యామ్..  తెలంగాణ పోలీసులపై కేసు నమోదు

Nagarjuna Sagar Dam

Updated On : December 2, 2023 / 12:33 PM IST

Nagarjuna Sagar Dam : నాగార్జున సాగర్ డ్యామ్ పైకి సీఆర్పీఎఫ్ బలగాలు చేరుకున్నాయి. దీంతో డ్యామ్ పై ఉన్న తమ బలగాలను తెలంగాణ పోలీస్ శాఖ వెనక్కి పిలిపించింది. మధ్యాహ్నం కల్లా సాగర్ ప్రాజెక్టును పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోనుంది. సాగర్ ప్రాజెక్టు పర్యవేక్షణ బాధ్యతలను కృష్ణా బోర్డుకు, కేంద్ర బలగాలకు అప్పగించాలన్న కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి. దీంతో సీఆర్పీఎఫ్ బలగాలు శనివారం తెల్లవారు జామున డ్యామ్ వద్దకు చేరుకున్నాయి. మధ్యాహ్నం వరకు పూర్తిస్థాయిలో డ్యామ్ ను సీఆర్పీఎఫ్ బలగాలు స్వాధీనం చేసుకోనున్నాయి. ఆ తరువాత 13వ గేట్ వద్ద కంచెను తొలగించే అవకాశం ఉంది. మరోవైపు సాగర్ డ్యామ్ నుంచి కుడి కాలువకు నీటి విడుదల కొనసాగుతోంది. కుడి కాలువ ద్వారా ప్రస్తుతం 5,450 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది.

Also Read : Election Counting : నాలుగు రాష్ట్రాల్లో రేపే అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్.. కేంద్ర బలగాలతో భద్రత.. ఫలితాలపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ప్రజలు

నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న తాజా వివాదం పరిష్కారానికి కేంద్రం సిద్ధమైంది. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల ఆపరేషన్ అంతా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగించేందుకు కేంద్ర జలశక్తి శాఖ సిద్ధపడింది. ఉదయం 11గం.లకు జలశక్తి శాఖ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. జలశక్తి శాఖ కార్యదర్శి నేతృత్వంలో జరగనున్న ఈ అత్యవసర సమావేశానికి హాజరుకావాలని రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, సీఆర్పీఎఫ్, సిఐఎస్ఎఫ్ డీజీలు, కేంద్ర జలసంఘం, కేఆర్ఎంబీ చైర్మన్ లకు పిలుపు అందించింది. ఈ సమావేశంలో నాగార్జున సాగర్ వద్ద ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితి, కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల నిర్వహణ అప్పగింత అంశాలపై ప్రధానంగా అధికారులు చర్చించనున్నారు.

మరోవైపు తెలంగాణ పోలీసులపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. సాగర్ పోలీస్ స్టేషన్ తో పాటు పల్నాడు జిల్లా విజయపురి సౌత్ పీఎస్ లోనూ తెలంగాణ పోలీసులపై ఏపి ఇరిగేషన్ అధికారులు పిర్యాదు చేశారు. సెక్షన్ 447, 341, రెడ్ విత్ 34 ఐపీసీల కింద కేసు నమోదైంది. ఏఎస్ఐ సోమ్లా నాయక్ ఫిర్యాదు మేరకు సెక్షన్ 323, 427, 341 రెడ్ విత్ 34 ఐపీసీల కింద మరో కేసు నమోదు చేశారు.

Also Read : Telangana Final Exit Poll Results 2023 : తెలంగాణలో గెలిచేది ఈ పార్టీనే..! ఇండియా టుడే-మై యాక్సిస్ సంచలన ఎగ్జిట్ పోల్స్‌

గతనెల 30న తెల్లవారుజామున నాగార్జున సాగర్ డ్యామ్ పైకి ఏపీ ప్రభుత్వం పోలీసులను మోహరించిన విషయం తెలిసిందే. సాగర్ కుడి కాలువ ద్వారా నీటి విడుదల చేసింది. దీంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తింది. ఇరు రాష్ట్రాల పోలీసులు డ్యామ్ పైకి చేరుకోవటంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులను తొలగించేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. ఇరు రాష్ట్రాల ప్రతిపాదనలతో సీఆర్పీఎఫ్ బలగాలు డ్యామ్ పైకి చేరుకొని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.