LPG Crisis: హైదరాబాద్లో ఎల్పీజీ టెన్షన్.. గ్యాస్ ఆటో నుంచి సిలిండర్లు ఎత్తుకెళ్లేందుకు కస్టమర్ల యత్నం
గ్యాస్ ఏజెన్సీ నుంచి సిలిండర్లతో బయటకు వచ్చిన ఆటో నుంచి సిలిండర్లు ఎత్తుకెళ్లేందుకు కస్టమర్లు యత్నించారు.
LPG Crisis: గ్యాస్ సిలిండర్ల కొరత ఎంత తీవ్రంగా ఉందో చెప్పేందుకు ఈ ఘటనే నిదర్శనం. హైదరాబాద్ లో ఒక్కసారిగా కలకలం రేగింది. గ్యాస్ ఏజెన్సీకి చెందిన ఆటో నుంచి సిలిండర్లు ఎత్తుకెళ్లేందుకు కస్టమర్లు యత్నించడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ ఘటన షేక్ పేట్ లో జరిగింది. గ్యాస్ ఏజెన్సీ నుంచి సిలిండర్లతో బయటకు వచ్చిన ఆటో నుంచి సిలిండర్లు ఎత్తుకెళ్లేందుకు కస్టమర్లు యత్నించారు. వెంటనే గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది అలర్ట్ అయ్యారు. స్థానికుల సాయంతో సిబ్బంది వారిని అడ్డుకున్నారు. గ్యాస్ బుక్ చేసి చాలా రోజులైందని, ఇంతవరకు తమకు సిలిండర్ రాలేదంటూ కస్టమర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పశ్చిమాసియాలో చెలరేగిన యుద్ధ జ్వాలలు ప్రపంచంపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. యుద్ధం కారణంగా ఎల్పీజీ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇది గ్యాస్ కొరతకు దారితీసింది. యుద్ధం ప్రభావం భారత్ పైనా పడింది. మన దేశంలోనూ గ్యాస్ కొరత కనిపిస్తోంది. సిలిండర్ బుక్ చేసి చాలా రోజులు అవుతున్నా రావడం లేదని జనాలు గగ్గోలు పెడుతున్నారు. ఖాళీ సిలిండర్లతో గ్యాస్ ఏజెన్సీల ముందు క్యూలు కడుతున్నారు. మాకు గ్యాస్ సిలిండర్ ఇవ్వండి మహాప్రభో అని ఏజెన్సీలను వేడుకుంటున్నారు.
గ్యాస్ నిల్వల కొరతతో సాధారణ ప్రజలు, హోటల్స్ నిర్వాహకులు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కమర్షియల్ గ్యాస్ సరఫరా ఇంకా పునరుద్దరణ కాకపోవడంతో దుకాణాలు మూసివేశామని వ్యాపారులు వాపోతున్నారు. కొంతమంది కట్టెల పొయ్యిలపై ఆహార పదార్దాలు తయారు చేసి వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు వంట గ్యాస్ కోసం ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారు. గ్యాస్ బుక్ చేసినా తమకు సిలిండర్లు ఇవ్వకుండా ఏజెన్సీ నిర్వాహకులు బ్లాక్ మార్కెట్ లో అధిక ధరకు విక్రయిస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు. ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టి గ్యాస్ సరఫరా చేయాలని కోరుతున్నారు.
Also Read: గ్యాస్ కష్టాల వేళ కేంద్రం బంపర్ ఆఫర్లు..
