Telangana Assembly Election 2023 : ఎస్సీ,ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో దళిత, ఆదివాసీ ఓటర్లే కీలకం

తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీతోపాటు పలు జనరల్ కేటగిరి అసెంబ్లీ నియోజకవర్గాల్లో దళితులు, ఆదివాసీలు ఎక్కువగా ఉన్నారు. దళితులు, ఆదివాసీల ఓట్లను కైవసం చేసుకునేందుకు అధికార బీఆర్ఎస్ తోపాటు కాంగ్రెస్, బీజేపీలు పలు హామీలతో వారిని ఆకర్షించేందుకు యత్నిస్తున్నాయి.....

Telangana Assembly Election 2023 : ఎస్సీ,ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో దళిత, ఆదివాసీ ఓటర్లే కీలకం

brs,congress,bjp

Telangana Assembly Election 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరాంగణంలో నాలుగింట ఒక వంతు ఉన్న దళితులు, ఆదివాసీలు కీలకపాత్ర పోషించనున్నారు. తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీతోపాటు పలు జనరల్ కేటగిరి అసెంబ్లీ నియోజకవర్గాల్లో దళితులు, ఆదివాసీలు ఎక్కువగా ఉన్నారు. దళితులు, ఆదివాసీల ఓట్లను కైవసం చేసుకునేందుకు అధికార బీఆర్ఎస్ తోపాటు కాంగ్రెస్, బీజేపీలు పలు హామీలతో వారిని ఆకర్షించేందుకు యత్నిస్తున్నాయి.

తెలంగాణలో పెరిగిన ఎస్సీ, ఎస్టీ జనాభా

తెలంగాణలో దళితులు, ఆదివాసీల మద్ధతు కోసం ప్రధాన రాజకీయ పార్టీలైన అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు వారి వారి మ్యానిఫెస్టోల్లో పలు పథకాలు ప్రకటించాయి.తెలంగాణ రాష్ట్ర జనాభాలో ఎస్సీలు 15.45 శాతం మంది ఉన్నారు. 2011వ సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం ఎస్టీల నిష్పత్తి 9.08 శాతం. అయితే ఆగస్టు 2018లో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం ఎస్సీలు, ఎస్టీల నిష్పత్తి వరుసగా 18 శాతం 10 శాతానికి పెరిగింది.

33 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కీలకం

తెలంగాణ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 76 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎస్సీ ఓటర్ల సంఖ్య 15 శాతానికి పైగా ఉన్నట్లు ఎన్నికల గణాంకాలు తెలియజేస్తున్నాయి. మొత్తం 119 నియోజకవర్గాల్లో 33 నియోజకవర్గాల్లో ఎస్టీ ఓటర్ల సంఖ్య 10 శాతానికి మించి ఉంది. చాలా నియోజకవర్గాల్లో ఎస్సీ, ఎస్టీ ఓటర్లే కీలకంగా మారారు. 2018వ సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఎస్సీ,ఎస్టీ ఓట్లలో భారీ భాగాన్ని కైవసం చేసుకుంది.

బీఆర్ఎస్ ధీమా

అధికార బీఆర్ఎస్ గత తొమ్మిదన్నరేళ్లుగా అమలు చేసిన పథకాలను ప్రచారం చేస్తూ ఎస్సీ, ఎస్టీ ఓటర్ల మద్ధతు నిలుపుకుంటామని నమ్మకంగా ఉంది. పలు పథకాలు అమలు చేయడం ద్వారా బీఆర్ఎస్ వారి విశ్వాసాన్ని పొందింది. ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి ప్రస్తుత ఏడాది తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌లో రూ.51,983 కోట్ల భారీ కేటాయింపులు చేశారు. ఈ కేటాయింపుల్లో ఎస్సీలకు ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్‌డిఎఫ్) కింద రూ.36,750 కోట్లు, ఎస్టీలకు ఎస్‌డిఎఫ్ కింద రూ.15,233 కోట్లు ఉన్నాయి. దళిత బంధు పథకం కింద 2021వ సంవత్సరం అక్టోబర్లో ప్రారంభించారు. ప్రస్తుత సంవత్సరం బడ్జెట్‌లో 1.77 లక్షల దళిత కుటుంబాలకు సహాయం చేయడానికి రూ. 17,700 కోట్లు కేటాయించారు.

Dalit, Adivasi voters

Dalit, Adivasi voters

గ్రామ పంచాయితీలుగా మారిన తండాలు

బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2,472 గిరిజన తండాలు, గూడెంలను గ్రామ పంచాయతీలుగా మార్చింది. విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీలకు రిజర్వేషన్ల పరిమాణాన్ని 10 శాతానికి పెంచారు. ఎస్టీ వర్గాలకు దళిత బంధు తరహాలో గిరిజన బంధును ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు. అర్హులైన లబ్ధిదారులందరికీ ఈ ఏడాది జూన్‌ నుంచి పోడు భూమి పట్టాలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

కాంగ్రెస్ అంబేద్కర్ అభయహస్తం

తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ దళిత, ఆదివాసీ ఓట్లను చేజిక్కించుకోవాలని చూస్తున్నాయి. కాంగ్రెస్ చేవెళ్ల ఎస్సీ,ఎస్టీ డిక్లరేషనుతో ముందుకు వచ్చింది. దళిత బంధు పథకానికి అంబేద్కర్ అభయ హస్తంగా నామకరణం చేసి, ఎస్సీ, ఎస్టీలకు ఒక్కో కుటుంబానికి రూ.12 లక్షల ఆర్థిక సాయం అందించాలని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ప్రైవేట్ విద్యాసంస్థల్లో అడ్మిషన్లు, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలకు రిజర్వేషన్లు వర్తింప చేస్తామని,గృహ లక్ష్మిని ఇందిరమ్మ పక్కా ఇళ్ల పథకంగా మారుస్తామని ప్రకటించింది. రాష్ట్రంలోని ప్రతి ఎస్సీ,ఎస్టీ కుటుంబానికి ఇల్లు-స్థలం, ఇళ్ల నిర్మాణానికి రూ.6 లక్షల సాయం అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.

చేవెళ్ల డిక్లరేషన్‌

చేవెళ్ల డిక్లరేషన్‌లో మూడు కొత్త ఎస్సీ కార్పొరేషన్లు-మాలలు, మాదిగలు, ఇతర ఉపకులాలకు ఒక్కొక్కటి- ఏర్పాటు చేస్తామని, వీటిలో ఒక్కొక్కదానికి రూ.750 కోట్ల వార్షిక గ్రాంట్‌లు వస్తాయని కాంగ్రెస్ నేతలు చెప్పారు. ఎస్టీల కోసం కూడా మూడు కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. తుకారాం ఆదివాసీ కార్పొరేషన్, సంత్ సేవాలాల్ లంబాడా కార్పొరేషన్, యెరుకల కార్పొరేషన్ వీటిలో ఒక్కొక్కదానికి రూ. 500 కోట్ల వార్షిక గ్రాంట్లను కేటాయిస్తామని కాంగ్రెస్ చెబుతోంది. సమ్మక్క-సారలమ్మ పండుగను జాతీయ పండుగగా గుర్తిస్తామని కాంగ్రెస్, బీజేపీలు హామీ ఇచ్చాయి.

ఎస్సీల విభజనే బీజేపీ అస్త్రం

తెలంగాణలోని ఎస్సీలను ఏ,బీ,సీ,డీ కేటగిరీలుగా సబ్‌ కేటగిరీలుగా మార్చాలనే డిమాండ్‌పై కేంద్రప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేస్తుందని నగరంలో ఎంఆర్‌పీఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. గత రెండు దశాబ్దాలుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను వేగవంతం చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది.

ALSO READ : Rainfall Alert : దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు…14 మంది మృతి,ఐఎండీ హెచ్చరికలు జారీ

ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను వరుసగా 18 శాతానికి, 12 శాతానికి పెంచుతామని బీజేపీ హామీ ఇచ్చింది. వెనుకబడిన ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కోటాను రద్దు చేసి, ఎస్సీ, ఎస్టీలు, బీసీలకు కేటాయిస్తామని బీజేపీ ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీ ఓటర్లు ఏ రాజకీయ పార్టీకి ఓట్లేస్తారనేది తెలియాలంటే డిసెంబరు 3 ఓట్ల లెక్కింపు తేదీ వరకు వేచిచూడాల్సిందే.