Danam Nagender: ఈ తీర్పు ఊహించిందే.. ఇక ప్రజాక్షేత్రంలోనే, ఉప ఎన్నిక గెలుపు మాదే.. సుప్రీం తీర్పుపై దానం సంచలన కామెంట్స్
సుప్రీంకోర్టు తన అనర్హత వేటును సమర్థిస్తూ తీర్పునిచ్చిన నేపథ్యంలో ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender)కీలక వ్యాఖ్యలు చేశారు.
Danam Nagender sensational comments on Supreme Court disqualification verdict.
Danam Nagender: సుప్రీంకోర్టు తన అనర్హత వేటును సమర్థిస్తూ తీర్పునిచ్చిన నేపథ్యంలో ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender)కీలక వ్యాఖ్యలు చేశారు. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును తాను స్వాగతిస్తున్నానని, రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ఊరట లభిస్తుందని ఆశించి లీగల్ పోరాటం చేశానని తెలిపారు. కోర్టు తీర్పు ఎలా వస్తుందోనని వేచి చూశానని, ఇది ఊహించిన పరిణామమేనని పేర్కొన్నారు. తీర్పు ఏదైనా తాము ప్రజాక్షేత్రంలోనే ఉంటామని, ఎన్నికలకు సంపూర్ణంగా సిద్ధమవుతున్నానని స్పష్టం చేశారు.
ఖైరతాబాద్ ప్రజలతో విడదీయరాని బంధం – లోడెడ్ రైఫిల్లా కార్యకర్తలు:
ఖైరతాబాద్ నియోజకవర్గం ప్రజలతో తనకు దశాబ్దాలుగా విడదీయరాని బంధం ఉందని, స్థానికులు తనను కుటుంబ సభ్యుడిగా భావిస్తారని దానం అన్నారు. తన అనుచరులు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని, వారు ఎల్లప్పుడూ లోడ్ చేసిన రైఫిల్లా పనిచేసేందుకు వేచి చూస్తున్నారని వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి మరింత వేగవంతమైందని కొనియాడారు. ప్రభుత్వ సహకారంతో ఖైరతాబాద్‌లో నిరుపేదల కోసం 10 వేల ఇండ్లు కట్టించి తీరుతానని, అధికారుల నిర్లక్ష్యం వల్ల ఓట్లు తగ్గినా తిరిగి గెలిచి తీరతానని ధీమా వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్ నాయకత్వంపై ప్రశంసలు – విమర్శలకు చెక్:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డైనమిక్ సీఎంగా వర్ణించిన దానం, ప్రభుత్వంపై ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. విద్యుత్ కోతలు లేకుండా ఎంత ఖర్చయినా పవర్ కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారని గుర్తుచేశారు. చిన్న చిన్న సమస్యలను కొందరు భూతద్దంలో చూపుతున్నారని, బీఆర్ఎస్ విమర్శలు, సోషల్ మీడియా అబద్ధాలను తాను పట్టించుకోనని కొట్టిపారేశారు. గతంలో ఓడిపోయిన అనుభవాలు ఉన్నప్పటికీ ప్రజాబలమే తన అసలైన శక్తని, ఈ ఉప ఎన్నికల్లో ప్రజలు తన వైపే నిలబడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
