రాజీవ్‌ యువ వికాసం స్కీమ్‌ మంజూరు పత్రాల పంపిణీ వాయిదా… ఎందుకంటే?

ఈ నెల 5న కేబినెట్‌ భేటీ జరగనుంది.

రాజీవ్‌ యువ వికాసం స్కీమ్‌ మంజూరు పత్రాల పంపిణీ వాయిదా… ఎందుకంటే?

Rajiv Yuva Vikasam Scheme

Updated On : June 2, 2025 / 9:26 AM IST

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇవాళ రాజీవ్‌ యువ వికాసం మంజూరు పత్రాలను లబ్ధిదారులకు జారీ చేయాలని ప్రభుత్వం భావించింది. ఇవాళ తొలి రెండు కేటగిరీల వారికి ఇవ్వాలని అనుకుంది.

అయితే, అర్హులకు ఆ పత్రాలు ఇవ్వడానికి కాస్త సమయం పడుతుందని, దీనిపై ఈ నెల 5న కేబినెట్‌ భేటీలో చర్చించాలని సర్కారు నిర్ణయించింది. ఈ పథకంతో పాటు ఇతర ముఖ్యమైన అంశాలపై ఇందులో చర్చించి నిర్ణయం తీసుకుంటారు.

నిన్న మంత్రులతో సీఎం రేవంత్‌ రెడ్డి రెండున్నర గంటల పాటు చర్చించారు. ఇందులో రాజీవ్‌ యువ వికాసంతో పాటు రెవెన్యూ సదస్సులు, ఇందిరమ్మ ఇళ్లు, వర్షాకాలం పంటల సాగు వంటివాటిపై చర్చలు జరిపారు.

Also Read: శ్రేయస్ అయ్యర్ అరుదైన రికార్డు… ఇటువంటి ఘనత సాధించిన ఒకే ఒక్క కెప్టెన్‌ ఇతడు

కాగా, తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న రాజీవ్‌ యువ వికాసం స్కీమ్‌కు స్పందన బాగా వస్తోంది. దీంతో ఇందులోని 4 కేటగిరీల్లో చేసుకున్న దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించిన అనంతరమే అర్హులను ఎంపిక చేయాలని మంత్రులు సూచించారు. ఇందులో అనర్హులకు చోటు దక్కకూడదని అన్నారు. అలాగే, అర్హులైనవారికి తప్పకుండా ఈ పథకాన్ని వర్తించజేయాలని చెప్పారు.

ఈ స్కీమ్‌ కింద వచ్చిన అప్లికేషన్ల విషయంలో కంప్లైంట్లు వస్తున్నాయని అన్నారు. అప్లికేషన్లపై అత్యంత పారదర్శకంగా పరిశీలన ఉండాలని రేవంత్‌ రెడ్డికి మంత్రులు విజ్ఞప్తి చేశారు. అప్లికేషన్ల పరిశీలన పూర్తయిన తర్వాతే అర్హుల లిస్టును విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

మరోవైపు, తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన విషయాలను కూడా రేవంత్‌ రెడ్డికి మంత్రులు వివరించారు. ఈ ప్రక్రియను సమర్థంగా నిర్వహించడానికి చర్యలు తీసుకున్నారని మంత్రులు అన్నారు. కాగా, ఆర్థికేతర విషయాల పరిష్కారానికి తెలంగాణ సర్కారు సానుకూలంగా ఉందని, మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకుందామని రేవంత్‌ రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది.