Black Fungus : భయపడొద్దు.. కోవిడ్ సోకిన ప్రతి ఒక్కరికి బ్లాక్ ఫంగస్ రాదు

Black Fungus : భయపడొద్దు.. కోవిడ్ సోకిన ప్రతి ఒక్కరికి బ్లాక్ ఫంగస్ రాదు

Black Fungus

Updated On : May 14, 2021 / 9:19 AM IST

Black Fungus : కోవిడ్ సోకిన ప్రతి ఒక్కరికి బ్లాక్ ఫంగస్ రాదన్నారు డీఎంఈ రమేష్ రెడ్డి. తెలంగాణలో బ్లాక్ ఫంగస్ కలకలం రేపుతుండటంపై వైద్యాధికారులు వివరణ ఇచ్చారు. బ్లాక్ ఫంగస్ కొందరిలో మాత్రమే ఉంటుందని, వాటికి ఇచ్చే మందులు తక్కువగా ఉన్నాయన్నారు. ఇప్పటివరకు ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి గాంధీకి మూడు బ్లాక్ ఫంగస్ కేసులు వచ్చాయన్నారు. అలాగే ఇంకా ఆయా ఆసుపత్రుల్లోని బ్లాక్ ఫంగస్ కేసులను గాంధీకి పంపుతామనడం సరి కాదన్నారు.

హైడోస్ స్టెరాయిడ్స్ వాడే కొందరిలో మాత్రం ఈ బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ విషయంలో అనవసరంగా భయాందోళనలకు గురికావొద్దని ఆయన సూచించారు. కేవలం కొందరికి మాత్రమే ఈ బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఇందుకు సరైన చికిత్స అందించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని రమేశ్ రెడ్డి తెలిపారు.

ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్‌తో యావత్ దేశం ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇది చాలదన్నట్లు ఇఫ్పుడు బ్లాక్ ఫంగస్ (మ్యుకర్ మైకోసిస్) కూడా వచ్చేసింది. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, కర్నాటకతో పాటు తెలంగాణలోనూ బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవుతున్నాయి. అంతేకాదు ఈ వ్యాధితో ఇప్పటికే ఒకరు మరణించారు. గురువారం(మే 13,2021) నిర్మల్ జిల్లా భైంసాలోని గణేష్‌నగర్‌కు చెందిన తోట లింగురామ్ అనే వ్యక్తి బ్లాక్ ఫంగస్‌తో మరణించారు. మృతుడికి మధుమేహంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఇటీవలే కరోనా కూడా సోకింది. చికిత్స అనంతరం కోవిడ్ నుంచి కోలుకున్నాడు. ఆ తర్వాత బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించాయి. ముక్కు, కళ్ల నుంచి ఇన్ఫెక్షన్ మెదడుకు వ్యాపించిందని.. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించింది. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశాడు.

కొన్ని రోజులుగా భైంసాకు చెందిన మరో వ్యక్తి కూడా బ్లాక్ ఫంగస్ లక్షణాలతో మరణించినట్లు స్థానికులు తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న వారంలోపే ఆయనలో షుగర్ లెవెల్స్ భారీగా పెరిగాయి. ఒక కన్ను పూర్తిగా మూసుకుపోయింది. హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ వారం రోజుల క్రితం మృతి చెందాడు. నిర్మల్‌ జిల్లాకే చెందిన మరో ఐదుగురు బ్లాక్ ఫంగస్‌తో బాధపడుతున్నట్లు తెలిసింది. ఇందులో కుబీర్ మండలానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి కూడా ఉన్నట్లు సమాచారం. మహారాష్ట్రంలో ఇప్పటికే పెద్ద మొత్తంలో బ్లాక్ ఫంగస్ కేసులు వస్తున్నాయి. 2వేల మందికి పైగా బ్లాక్ ఫంగస్ బారినపడ్డారు. మహారాష్ట్రకు పక్కనే నిర్మల్ జిల్లా ఉండడం.. ఇప్పటికే ఇద్దరు మృతి చెందినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో.. అక్కడి ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.