దుబ్బాక బై పోల్..పొలిటికల్ హీట్

Dubbaka bypoll..political heat : దుబ్బాక బై పోల్ పొలిటికల్ హీట్ పెంచుతోంది. ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంతో.. ప్రచారం జోరందుకుంది. ప్రజలంతా తమతోనే ఉన్నారని.. ఉప ఎన్నికలో విజయం తమదేనంటూ.. ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఓట్లేయాలని గులాబీ పార్టీ చెబుతుంటే.. ప్రజలకు టీఆర్ఎస్ చేసిందేమీ లేదంటూ కాంగ్రెస్, బీజేపీ విమర్శలు చేస్తుండటం ఎలక్షన్ హీట్‌ను పెంచింది. విమర్శలు, ప్రతి విమర్శలతో ప్రచారం మరింత ఊపందుకుంది.
కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగారు చెరుకు శ్రీనివాస్ రెడ్డి. మొదటి నుంచి శ్రీనివాస్‌రెడ్డికే సీట్ ఇస్తారంటూ ప్రచారం జరిగినా.. కాస్త సస్పెన్స్ కొనసాగింది. ఎట్టకేలకు శ్రీనివాస్‌రెడ్డిని దుబ్బాక ఉప ఎన్నిక బరిలోకి దింపింది కాంగ్రెస్ అధిష్టానం. దుబ్బాకలో ఎలాగైన గెలవాలనే కాంగ్రెస్ ఆరాటం ఎంతో కొంత ఈ ఎన్నికల్లో ఓట్లను తీసుకొచ్చే అవకాశం ఉండగా..
తన తండ్రి చెరకు ముత్యంరెడ్డి క్లీన్ పాలిటిక్స్, నియోజకవర్గంలో గతంలో చేసిన అభివృద్ధి తనకు కలిసొస్తాయని భావిస్తున్నారు శ్రీనివాస్ రెడ్డి. ఇటీవలే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన చెరుకు శ్రీనివాస్‌రెడ్డి గులాబీ పార్టీపై విమర్శలు గుప్పించారు. తన తండ్రి ముత్యంరెడ్డిని ఓట్ల కోసం వాడుకొని టీఆర్‌ఎస్ పార్టీ వదిలేసిందని మండిపడ్డారు.
చెరుకు శ్రీనివాస్‌రెడ్డి కామెంట్స్‌కు అదే స్థాయిలో కౌంటరిచ్చారు టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్, మంత్రి హరీశ్‌రావు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. కాంగ్రెస్‌పై విమర్శనాస్త్రాలను ఎక్కెపెట్టారు. నిన్నమొన్నటి వరకు కేసీఆర్, హరీశ్ రావుకు జై కొట్టిన వ్యక్తికి.. టికెట్ ఇవ్వకపోయేసరికి చెడ్డవాళ్లం అయ్యామా అని ప్రశ్నించారు.
గతంలో దుబ్బాకకు ఎప్పుడూ రాని కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు ఖద్దరు చొక్కాలు వేసుకుని మరీ వస్తున్నారని హరీశ్ ఘాటుగా విమర్శించారు. మరోవైపు.. బీజేపీ నుంచి ఉప ఎన్నిక బరిలో దిగారు రఘునందన్‌రావు. రఘునందన్‌కు టికెట్ కేటాయించడంతో దుబ్బాక బీజేపీలో ముసలం ఏర్పడింది.
స్థానిక బీజేపీ నేత తోట కమలాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తీవ్రంగా విమర్శలు చేసారు. దీంతో… తోట కమలాకర్‌రెడ్డిని పార్టీ నుంచి బీజేపీ సస్పెండ్ చేసింది. రఘునందన్‌రావు గతంలో దుబ్బాక నుంచి రెండు సార్లు పోటీ చేశారు. ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన ఆయన.. ఒక్క ఛాన్స్ అంటూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.
అధికార ప్రతిపక్షాల మాటల యుద్ధంతో దుబ్బాకలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. టీఆర్ఎస్ – కాంగ్రెస్ – బీజేపీ అభ్యర్థులు మాటల తూటాలు పేలుస్తున్నారు. ఏదైమైనా దుబ్బాక ఉప ఎన్నిక రాజకీయం పార్టీల మధ్య కంటే వ్యక్తుల చుట్టే అధికంగా తిరుగుతోంది.