కాంగ్రెస్‌కు దుబ్బాక దడ… ఓటమి కన్నా ఎక్కువగా భయపెడుతున్న బీజేపీ

  • Published By: naveen ,Published On : November 9, 2020 / 03:37 PM IST
కాంగ్రెస్‌కు దుబ్బాక దడ… ఓటమి కన్నా ఎక్కువగా భయపెడుతున్న బీజేపీ

Updated On : November 9, 2020 / 4:09 PM IST

congress dubbaka tension: తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా దుబ్బాక‌ ఉప ఎన్నిక‌కు విప‌రీత‌మైన ప్రాధాన్యం ఏర్పడింది. ఈ ఎన్నిక‌కు అన్ని ప్రధాన పార్టీలు గ‌ట్టిగా చెమ‌టోడ్చాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ లేనంతగా త‌న శ‌క్తియుక్తుల‌న్నీ ప్రద‌ర్శించింది. పార్టీ భ‌విష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని చిన్నా, పెద్దా అని తేడా లేకుండా నేత‌లంతా దుబ్బాక‌లో మోహ‌రించారు. మండ‌లాల‌కు సీనియ‌ర్ నేత‌లు ఇన్‌చార్జీలుగా, గ్రామానికి, ప్రతీ పోలింగ్ బూత్‌కు ప్రత్యేక ఇన్‌చార్జీల‌ను పెట్టి ప్రచారాన్ని హోరెత్తించింది. ఉప ఎన్నికల ఓటింగ్‌ పూర్తయినప్పటి నుంచి కాంగ్రెస్‌ నేతల్లో కలవరం మొదలైందని అంటున్నారు.

ఈసారి డిపాజిట్ కూడా కష్టమే:
దుబ్బాక ఉప ఎన్నికకు విపరీతంగా క‌ష్టప‌డిన కాంగ్రెస్ ముఖ్యులు.. ఫ‌లితం ఎలా ఉండ‌బోతుంద‌నేది ఊహించుకొని క‌ల‌వ‌రప‌డుతున్నారు. ఎన్నిక‌ల స‌ర‌ళి, అనంత‌రం వెలువ‌డుతున్న ఎగ్జిట్ పోల్స్ నేత‌ల‌ను ఆందోళ‌న‌కు గురిచేస్తున్నాయట. గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల్లో 26వేల ఓట్లతో రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్‌కు.. ఈసారి డిపాజిట్ కూడా క‌ష్టమ‌నే వార్తల‌తో నేత‌లు ఉలిక్కిప‌డుతున్నారని అంటున్నారు. నేత‌లంద‌రూ ఇంత‌గా క‌ష్టప‌డినా.. ఓట‌ర్ల మ‌న‌సును ఎందుకు గెలుచుకోలేక‌పోయామ‌ని మ‌దన‌ప‌డుతున్నారు.

కాంగ్రెస్ ఓడిపోతుంద‌నే విష‌యం కంటే… బీజేపీ మెరుగుప‌డింద‌నే వార్తని జీర్ణించుకోలేకపోతున్నారు:
దుబ్బాక ఎఫెక్ట్‌తో ఏకంగా సీనియ‌ర్ నేత‌లంతా ఆలోచ‌న‌లో ప‌డ్డారని కాంగ్రెస్‌ పార్టీలో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ ఓడిపోతుంద‌నే విష‌యం కంటే… బీజేపీ మెరుగుప‌డింద‌నే వార్త క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేస్తోందని అంటున్నారు. రాష్ట్ర వ్యవ‌హారాల ఇన్‌చార్జ్ మాణిక్కమ్ ఠాగూర్‌ ఎన్నిక‌లు ముగిసిన వెంట‌నే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ నివాసంలో చ‌ర్చలు జ‌రిపారు. అనంత‌రం సీఎల్పీ నేత భ‌ట్టి విక్రమార్క నివాసంలో బ్రేక్ ఫాస్ట్ తర్వాత మాట్లాడుకున్నారు. ఆఖ‌రికి గాంధీభ‌వ‌న్‌లో కోర్ క‌మిటీ స‌మావేశం పెట్టి తేడా ఎక్కడ కొట్టింద‌నే దానిపై చర్చించుకున్నారని చెబుతున్నారు.
https://10tv.in/high-priority-in-posts-for-abvp-in-telangana-bjp/
బీజేపీ క‌నుక మెరుగుప‌డితే కాంగ్రెస్ ప‌రిస్థితి మ‌రింత అగ‌మ్యగోచ‌రం:
దుబ్బాక‌లో బీజేపీ క‌నుక మెరుగుప‌డితే కాంగ్రెస్ ప‌రిస్థితి మ‌రింత అగ‌మ్యగోచ‌రంగా మారుతుంద‌ని నేత‌లు ఆందోళ‌న చెందుతున్నార‌ట‌. ఈ ఎఫెక్ట్‌తో కేడర్‌ను కాపాడుకోవటం క‌త్తి మీద సాములా మారుతుంద‌ని టెన్షన్‌ పడుతున్నారని టాక్‌. ఈ నేపథ్యంలో వెంట‌నే న‌ష్ట నివార‌ణ చ‌ర్యలు చేప‌ట్టాల‌ని ముఖ్య నేతలంతా డిసైడ్‌ అయ్యారట. లేకపోతే పార్టీ పరిస్థితి మరింత దిగజారిపోవడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు. ఫలితాల తర్వాత కాంగ్రెస్‌ పరిస్థితి ఏంటోనని నిఖార్సయిన కార్యకర్తలు ఆలోచనలో పడ్డారు.