ఇంతటి పైశాచికత్వమా? కుర్చీలో కూర్చున్న తాతను 70 సార్లు కత్తితో పొడిచీ పొడిచీ చంపేసిన యువకుడు
హైదరాబాద్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులు వివరాలు తెలిపారు.

హైదరాబాద్‌లోని పంజాగుట్టలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తాతను మనవడు కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపాడు. ఆస్తి కోసమే అతడు ఈ క్రూరత్వానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి పేరు కిలారు కార్తి తేజ (29) అని పోలీసులు చెప్పారు. అతడు తన తాత, వెలిజ గ్రూప్స్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ వీ చంద్రశేఖర జనార్దన్ రావు (86)ను హత్య చేసినట్లు తేల్చారు.
జనార్దన్ రావుకి ముగ్గురు కూమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. జనార్దన్ రావు రెండో కూతురి పేరు సరోజ. ఆమె భర్త ఇతర ప్రాంతంలో ఉంటుండగా.. తండ్రితో కలిసి ఆమె హైదరాబాద్‌లోని సోమాజిగూడలో ఉంటోంది. ఆమె కుమారుడు కార్తి తేజ అమెరికాలో మాస్టర్స్ చదివి ఏడేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చాడు.
తనకు తాత ఆస్తిలో వాటా సరైన విధంగా ఇవ్వడం లేదని అతడు గొడవలు పడుతున్నాడు. అంతేగాక, బాల్యం నుంచి అందరినీ పెంచినట్లు తనను పెంచలేదని జనార్దన్‌పై పగ పెంచుకున్నాడు. తాతతోనే కాకుండా తల్లితోనూ పదే పదే గొడవలు పెట్టుకునేవాడు. కొంత కాలం క్రితం జనార్దన్ రావుకు చెందిన ఓ కంపెనీకి సరోజ అక్క కుమారుడిని జనార్దన్ రావు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా నియమించారు.
దీంతో కార్తి తేజ మరింత ఆగ్రహంతో ఉన్నాడు. జనార్దన్ రావును హత్య చేయాలని గత గురువారం రాత్రి ఆయన ఇంటికి వచ్చి, దాడి చేశాడు. కత్తితో సుమారు 60 నుంచి 70 సార్లు విచక్షణారహితంగా పొడిచాడు. ఆ సమయంలో జనార్దనరావు కూర్చీలో కూర్చుని ఉన్నాడు. ఆయన అరుపులు పెట్టడంతో సరోజ వేరే గది నుంచి వచ్చి అడ్డుకోబోయింది.
తల్లిని కూడా కార్తి కత్తితో ఆరు పోట్లు పొడిచాడు. సెక్యురిటీ గార్డు ఇంట్లోకి వచ్చి చూడగా, అతడినికి కూడా హత్య చేస్తానని బెదిరించి అక్కడి నుంచి కార్తి పారిపోయాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చారు.
జనార్దన్ రావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ఆయన సొంత ప్రాంతం ఏలూరుకు మృతదేహాన్ని తరలించారు. సరోజను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కార్తి తేజ కోసం గాలించి, అతడి ఆచూకీని సోమాజిగూడలో గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు.