Covid Pandemic: ఊరి జనాభా 1400.. కరోనా పాజిటివ్ 600మందికి

ప్రపంచ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తోన్న కరోనా పాజిటివ్ వచ్చిందంటే ఒక గదిలో ఉంచి ఐసోలేషన్ పాటిస్తున్నాం. కానీ, అక్కడ సగం ఊరు ఐసోలేషన్ లో...

Covid Pandemic: ఊరి జనాభా 1400.. కరోనా పాజిటివ్ 600మందికి

Covid Pandemic

Updated On : May 4, 2021 / 10:42 AM IST

Covid Pandemic: ప్రపంచ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తోన్న కరోనా పాజిటివ్ వచ్చిందంటే ఒక గదిలో ఉంచి ఐసోలేషన్ పాటిస్తున్నాం. కానీ, అక్కడ సగం ఊరు ఐసోలేషన్ లో ఉండాల్సిన పరిస్థితి. వికారాబాద్‌ మండలంలోని ఎర్రవల్లి గ్రామ దయనీయస్థితి ఇలా ఉంది. కరోనా ధాటికి ఊరంతా చెల్లాచెదురైంది. ఆ ఊరి జనాభా 1400 మందిగా ఉంటే.. వారిలో సుమారు 600 మందికి కరోనా వైరస్‌ సోకింది.

శ్వాస తీసుకునేందుకు ఇబ్బందిపడి వారం క్రితం ఇద్దరు మృతి చెందారు. జనమంతా వెళ్లిపోయి తమ వ్యవసాయ పొలాల వద్ద గుడిసెలు వేసుకొని క్వారంటైన్‌లో గడుపుతున్నారు. అధికారులు తమ గోడు వినిపించుకోవడం లేదని వాపోతున్నారు.

కలెక్టర్‌కు విన్నవించినా…
గ్రామంలో హెల్త్‌ క్యాంపు ఏర్పాటు చేసి అందరికీ టెస్టులు చేయాలని ఇటీవల గ్రామానికి వచ్చిన కలెక్టర్‌కు విన్నవించారు. అయినా ఎలాంటి స్పందన లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజూ ఏఎన్‌ఎం మాత్రం గ్రామానికి వచ్చి వెళ్తోందని చెబుతున్నారు. కరోనాతో చనిపోయినవారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకు రాకపోవడంతో కోఆప్షన్‌ మెంబర్‌ జాఫర్‌ జేసీబీల సాయంతో గుంతలు తవ్వించి మృతదేహాలను పూడుస్తున్నారు. ఈ సమయంలో దొంగలు ఊరి మీదపడి దోచుకుపోయినా అడిగే నాథుడులేడని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గ్రామస్థుల ఆవేదన ఇలా ఉంది..
హెల్త్‌ క్యాంపు పెట్టి ప్రతిఒక్కరికీ టెస్టులు చేయాలని పదిరోజుల క్రితం కలెక్టర్‌ను కోరాం. ఎమ్మెల్యే ఆనంద్‌కు కూడా సమాచారం ఇచ్చాం. జనం ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి.

మా నాన్నకు కరోనా పాజిటివ్‌ తో హోం ఐసోలేషన్‌లో ఉన్నాడు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడితే అంబులెన్స్‌లో గచ్చిబౌలి టిమ్స్‌కు తీసుకెళ్లాం. ఆక్సిజన్‌ పూర్తవుతోందని డాక్టర్లకు చెప్పినా పట్టించుకోలేదు. మా నాన్న ప్రాణం నా కళ్ల ముందే పోయింది.

గ్రామంలో సగం మందికి కరోనా వచ్చింది. ఊరు విడిచి పొలాల్లో ఉంటున్నాం. అధికారులు, ప్రజాప్రతినిధులేమో పట్టించుకోవడం లేదు. గ్రామంలో ఎప్పుడు, ఎవరు చనిపోతారోనని భయపడుతున్నాం. మమ్మల్ని ఎవరూ పట్టించుకోరా.. మా బతుకు ఇంతేనా..? ఇలా చచ్చిపోవాల్సిందేనా!