KCR Health Condition: కుదుటపడ్డ మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యం.. రేపు మరోసారి వైద్య పరీక్షలు
రైతాంగం సమస్యల మీద దృష్టి సారించారు కేసీఆర్. బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మాణంపై ఆందోళన వ్యక్తం చేశారాయన.

KCR Health Condition: తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఆరోగ్యం కుదుటపడింది. డాక్టర్ల సూచనల మేరకు గురువారం సోమాజీగూడ యశోదా ఆస్పత్రిలో మరోసారి వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు కేసీఆర్. గత ఐదు రోజులుగా నంది నగర్ ని తన నివాసంలో కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారు. వారం రోజులుగా పార్టీ ముఖ్య నేతలతో వరుసగా చర్చలు జరిపారు గులాబీ బాస్.
పంటలకు సాగునీరు అందక రైతుల అరిగోస పట్ల కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతాంగం సమస్యల మీద దృష్టి సారించారు కేసీఆర్. బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మాణంపై ఆందోళన వ్యక్తం చేశారాయన. రాష్ట్రంలో వర్తమాన రాజకీయ పరిస్థితుల గురంచి జిల్లాల వారీగా ఆరా తీస్తున్నారు కేసీఆర్. అటు తెలంగాణ ఉద్యమకారులతో సమావేశమవుతున్నారు గులాబీ బాస్.
ఈ నెల 3న కేసీఆర్ తీవ్ర జ్వరంతో అస్వస్థతకు గురయ్యారు. సోమాజీగూడ యశోద ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స తీసుకున్నారు. రక్తంలో షుగర్ స్థాయిలు అధికంగా ఉన్నాయని, సోడియం స్థాయిలు తక్కువగా ఉందని పరీక్షల్లో తేలటంతో వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. ఆ తర్వాత ఆరోగ్య పరిస్థితి మెరుగు పడటంతో శనివారం ఉదయం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు కేసీఆర్. హైదరాబాద్‌లోని నందినగర్‌లో ఉన్న తన నివాసంలో రెస్ట్ తీసుకుంటున్నారు బీఆర్ఎస్ అధినేత.