Cm Revanth Reddy: మీరు అసెంబ్లీకి వస్తారా, నన్ను ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కు రమ్మంటారా? కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్
క్లబ్బుల్లో, పబ్బుల్లో కాకుండా చట్టసభల్లో చర్చ చేద్దామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

Cm Revanth Reddy: మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. కృష్ణా జలాల వివాదంపై చర్చకు మేము సిద్ధం అని రేవంత్ అన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రాలేకుంటే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో చర్చిద్దాం అని సీఎం రేవంత్ అన్నారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోనే మాక్ అసెంబ్లీ నిర్వహిద్దామని చెప్పారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు మా మంత్రులను పంపిస్తా అని రేవంత్ అన్నారు. కేసీఆర్ రమ్మంటే చర్చలకు నేను కూడా వస్తాను అని రేవంత్ పేర్కొన్నారు. ఎప్పుడు చర్చ పెట్టుకుందామో తేదీ నిర్ణయించండి అని రేవంత్ అన్నారు. పబ్ లు, క్లబ్బుల్లో మాత్రం చర్చలు వద్దు అని వ్యాఖ్యానించారు. పబ్ లు, క్లబ్బుల కల్చర్ కు నేను పూర్తిగా వ్యతిరేకం అన్నారు సీఎం రేవంత్. దయచేసి నన్ను క్లబ్బులు, పబ్ లకు పిలవొద్దని బీఆర్ఎస్ నేతలకు విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి.
చర్చకు సిద్ధమా అంటూ బీఆర్ఎస్ నేతలు చేసిన సవాళ్లపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. చర్చకు సిద్ధమే అని స్పష్టం చేశారు. అయితే, అసెంబ్లీకి పోదాం.. లేదంటే ఎర్రవెల్లిలో చర్చిద్దాం అని చెప్పారు. అంతేకాదు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మాక్ అసెంబ్లీ నిర్వహిద్దామన్నారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు రావడానికి నేను కూడా సిద్ధమే అని రేవంత్ చెప్పారు. క్లబ్బుల్లో, పబ్బుల్లో కాకుండా చట్టసభల్లో చర్చ చేద్దామని పిలుపునిచ్చారు.
Also Read: సన్ రైజర్స్ హైదరాబాద్‌తో వివాదంలో బిగ్ ట్విస్ట్.. HCA ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు అరెస్ట్
కృష్ణా నది, కాళేశ్వరం ప్రాజెక్ట్ పై రేవంత్ సర్కార్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చింది. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్.. గత పాలకుల నిర్ణయాల వల్ల తెలంగాణకు నష్టం జరిగిందన్నారు. బీఆర్ఎస్ విచిత్రమైన వాదనను ముందుకు తెస్తోందని మండిపడ్డారు. ఏడాదిలోనే రాష్ట్రం సర్వ నాశనం అయిందని అంటున్నారు, మళ్లీ బీఆర్ఎస్ వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని వితండవాదం చేస్తున్నారు అని బీఆర్ఎస్ నాయకులపై ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. చచ్చిపోయిన పార్టీని బతికించుకునేందుకే నీళ్ల సెంటిమెంట్ తెస్తున్నారని రేవంత్ అన్నారు. నీళ్ల విషయంలో జగన్ కు కేసీఆర్ పూర్తిగా సహకరించారని రేవంత్ ఆరోపించారు.
తెలంగాణకు 299 టీఎంసీలు చాలని కేసీఆర్ సంతకం చేశారని చెప్పారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు కేసీఆర్ మరణశాసనం రాశారని ధ్వజమెత్తారు. ప్రాజెక్టులకు కేసీఆర్ పూర్తి చేసుంటే మనకు నీటి సమస్య వచ్చేదే కాదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పాలమూరు-రంగారెడ్డి అంచనాలు పెంచి నీటి సామర్థ్యాన్ని తగ్గించారని అన్నారు. తెలంగాణకు సీమాంధ్రులు చేసిన అన్యాయం కంటే కృష్ణా నీళ్లలో కేసీఆర్ చేసిన ద్రోహం వెయ్యి రెట్లు ఎక్కువ అని సీఎం రేవంత్ మండిపడ్డారు.
”ప్రశ్నిద్దామంటే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు. కేసీఆర్ హయాంలో 2లక్షల కోట్లు ఖర్చు చేస్తే ఒక్క ప్రాజెక్ట్ పూర్తి కాలేదు. పెండింగ్ ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమా? ఏ రోజైనా అసెంబ్లీలో చర్చించేందుకు మేము సిద్ధం. నిపుణుల అభిప్రాయాలను కూడా అసెంబ్లీలో వినిపిద్దాం. మీరెప్పుడు స్పీకర్ కు లేఖ రాసినా.. కృష్ణా, గోదావరి నదీ జలాలపై అసెంబ్లీలో చర్చించేందుకు సిద్ధం. ఎవరి గౌరవానికి భంగం కలగకుండా చర్చ జరిపే బాధ్యత నాది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ అసెంబ్లీకి రావాలి. కుటుంబ పంచాయితీలుంటే ఇంట్లో తేల్చుకోవాలి. వీధి బాగోతాలు మంచిది కాదు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాక్ అసెంబ్లీ నిర్వహించేందుకు సిద్ధం. మీరు కోరుకుంటే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో చర్చకు రావడానికి నేనూ సిద్ధమే” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.