HCA President Arrest: సన్ రైజర్స్ హైదరాబాద్‌తో వివాదంలో బిగ్ ట్విస్ట్.. HCA ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు అరెస్ట్
ప్రభుత్వ ఆదేశాలతో బెదిరింపుల అంశంపై సమగ్ర విచారణ చేసింది విజిలెన్స్. ప్రాథమిక విచారణ తర్వాత కేసు నమోదు చేసింది సీఐడీ.

HCA President Arrest: SRH(సన్ రైజర్స్ హైదరాబాద్), HCA(హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్) వివాదంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఐపీఎల్ టికెట్ల వివాదంలో హెచ్ సీఏ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావుని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. జగన్ మోహన్ రావుతో పాటు హెచ్ సీఏ సభ్యులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఐపీఎల్ టికెట్ల వివాదంలో విజిలెన్స్ నివేదికతో చర్యలు తీసుకుంది సీఐడీ.
హెచ్ సీఏ ప్రెసిడెంట్ హోదాలో SRH ను బెదిరించారని జగన్ మోహన్ రావుపై అభియోగాలు ఉన్నాయి. 20శాతం టికెట్లు ఉచితంగా ఇవ్వాలని ఎస్ఆర్ హెచ్ యాజమాన్యాన్ని బెదిరించినట్లు జగన్ మోహన్ రావుపై ఆరోపణలు వచ్చాయి. ఐపీఎల్ మ్యాచ్ లో వీఐపీ గ్యాలరీకి హెచ్ సీఏ తాళాలు కూడా వేయటం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాలతో బెదిరింపుల అంశంపై సమగ్ర విచారణ చేసింది విజిలెన్స్. ప్రాథమిక విచారణ తర్వాత కేసు నమోదు చేసింది సీఐడీ.
గత ఐపీఎల్ మ్యాచ్ ల సందర్భంగా ఎస్ఆర్ హెచ్, హెచ్ సీఏ మధ్య టికెట్ల వివాదం తలెత్తింది. మ్యాచ్ సందర్భంగా టికెట్స్ కేటాయించలేదని కార్పొరేట్ బాక్స్ కు తాళం వేసింది హెచ్ సీఏ. ఈ ఘటనతో హైదరాబాద్ వదిలి పోతామని SRH యాజమాన్యం చెప్పింది. ఇది తీవ్ర దుమారం రేపడంతో ఈ ఘటనపై విజిలెన్స్ ఎంక్వయిరీకి రేవంత్ ప్రభుత్వం ఆదేశించింది. హెచ్ సీఏ ప్రెసిడెంట్, ఎస్ఆర్ హెచ్ ఫ్రాంచైజీపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు విజిలెన్స్ అధికారులు నిర్ధారించారు.
Also Read: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్..
టికెట్ల కోసం ఎస్ఆర్ హెచ్ యాజమాన్యాన్ని ఇబ్బందులకు గురిచేసినట్లు నిర్ధారించింది. ఐపీఎల్ మ్యాచ్ కు సంబంధించి 10 శాతం టికెట్లను HCA కు ఫ్రీగా ఇస్తోంది ఎస్ఆర్ హెచ్ యాజమాన్యం. అయితే, మరో 10 శాతం టికెట్లు కావాలని యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చినట్టు విజిలెన్స్ నివేదికలో బట్టబయలైంది. ఫ్రీగా 10% టికెట్లు ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది ఎస్ఆర్ హెచ్ యజమాన్యం. ఓపెన్ మార్కెట్ లో కొనుగోలు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు జగన్ మోహన్ రావు. HCA ద్వారా రిక్వెస్ట్ పెడితే టికెట్లు ఇచ్చేందుకు ఒప్పుకుంది ఎస్ఆర్ హెచ్.
అయితే, తనకు వ్యక్తిగతంగా 10శాతం టికెట్లు కావాలని జగన్ మోహన్ రావు డిమాండ్ చేశారు. వ్యక్తిగతంగా టికెట్లు ఇచ్చే ప్రసక్తి లేదని ఎస్ ఆర్ హెచ్ తేల్చి చెప్పింది. ఎస్ఆర్ హెచ్ టికెట్లు ఇవ్వకపోవడంతో మ్యాచ్ ల సందర్భంగా ఇబ్బందులకు గురిచేశారు జగన్ మోహన్ రావు. లక్నోతో మ్యాచ్ సందర్భంగా వీఐపీ గ్యాలరీకి హెచ్ సీఏ సిబ్బంది తాళాలు వేశారు. ఎస్ఆర్ఎస్ ను తీవ్ర ఇబ్బందులకు గురి చేసినట్లు విజిలెన్స్ నివేదికలో నిర్ధారించారు. హెచ్ సీఏపై చర్యలకు విజిలెన్స్ సిఫారసు చేసింది.