Harish Rao Thanneeru : సీఎం రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలి- హరీశ్ రావు డిమాండ్

బీజేపీకి ఓటు వేస్తే పెనం మీద నుండి పొయ్యిల పడ్డట్టే. కొట్లాడాలంటే బీఆర్ఎస్ ని గెలిపించాలని కోరుతున్నా.

Harish Rao Thanneeru : సీఎం రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలి- హరీశ్ రావు డిమాండ్

Harish Rao Thanneeru : సీఎం రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. తప్పుడు ప్రచారం చేసినందుకు, గోబెల్స్ ప్రచారం చేసినందుకు రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటిసులు ఇచ్చారని చెప్పారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసులో అసోంలో ఒకరిని అరెస్ట్ చేశారన్న హరీశ్ రావు.. రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ ను అరెస్ట్ చేయకుంటే మోడీ, రేవంత్ ఇద్దరు కలిసినట్టే అని ఆరోపించారు. ఇద్దరి దోస్తాన బయటపడ్డట్టే అని అన్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలో మాజీమంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు.

”గులాబీ జెండా ఉండగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది. కాంగ్రెస్ వచ్చాక అనేక సమస్యలు. అన్ని వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. మహిళలకు 2500 అని మాట తప్పారు. 30 దాటినా పింఛన్లు ఇవ్వడం లేదు. తులం బంగారం ఇస్తా అని మోసం చేశారు. కాంగ్రెస్ వాళ్లు వచ్చాక బంగారం ధర కూడా పెరిగింది. నిరుద్యోగ భృతి అని మోసం చేశారు. కాంగ్రెస్ కు మళ్ళీ ఓటు వేస్తే హామీలు అమలు చేయరు. కొట్లాడాలంటే బీఆర్ఎస్ ని గెలిపించాలని కోరుతున్నా. కాంగ్రెస్ పాలన బయటపడింది.

బీజేపీకి ఓటు వేస్తే పెనం మీద నుండి పొయ్యిల పడ్డట్టే. తెలంగాణకు ఎంతో నష్టం చేసింది బీజేపీ. అందువల్ల బీజేపీని నమ్మొద్దు. అలవి గాని హామీలు ఇస్తే మొన్న దుబ్బాకలో ఆయన్ని చిత్తుగా 54వేల ఓట్లతో ఓడించారు. ట్రస్ట్ ద్వారా వంద కోట్లు ఖర్చు చేస్తా అంటున్న వెంకట్రామిరెడ్డిని గెలిపించాలి” అని హరీశ్ రావు కోరారు.

Also Read : తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న అమిత్ షా ఫేక్ వీడియో వ్యవహారం.. ఏం జరగనుంది?