రెండేళ్ల పాపతో సొంతూరికి కుటుంబం.. 36 గంటలు నరకం చూపించారు!

  • Published By: sreehari ,Published On : April 13, 2020 / 01:07 AM IST
రెండేళ్ల పాపతో సొంతూరికి కుటుంబం.. 36 గంటలు నరకం చూపించారు!

Updated On : April 13, 2020 / 1:07 AM IST

నగరం నుంచి సొంతూరుకు వచ్చిన ఓ ఫ్యామిలీకి లాక్‌డౌన్‌ ఇబ్బందులపాలు చేసింది. వరంగల్‌ జిల్లాలోని హన్మకొండ ప్రకాశ్‌రెడ్డిపేటలో బానోత్‌ రాజేందర్, సుమలత దంపతులు నివాసముంటున్నారు. వీరికి రెండేళ్లపాప కూడా ఉంది. లాక్‌డౌన్‌ కారణంగా రాజేందర్‌ ఈనెల 10న వరంగల్‌ జిల్లాలో ఊకల్లు సమీపంలో తన సొంతూరు బాలాజీతండాకు ఆటోలో వెళ్లాడు. శుక్రవారం రాత్రి తన కుటుంబంతో కలిసి ఇంటికి చేరుకున్నాడు. మరుసటి రోజు పొరుగింటివారు అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ముగ్గురికి హోం క్వారంటైన్‌ ముద్రలు వేశారు. ఇంట్లోనే ఉండాలని ఆదేశించారు. ఆటోలో వెళ్లడానికి పాస్‌ ఇచ్చి మళ్లీ హన్మకొండకి పంపించారు రాయపర్తి పోలీసులు.

రాజేందర్‌ కుటుంబం హన్మకొండలోని ఇంటికి చేరుకున్నారు. చేతులకు హోం క్వారంటైన్‌ ముద్రలు వేయడంతో ఇంటి యజమాని ఇంట్లోకి అనుమతించలేదు. రాజేందర్‌ చేసేది ఏమిలేక వరంగల్‌ జిల్లా చెన్నారావుపేటలోని తన బంధువుల ఇంటికి చేరుకున్నారు. ఇక్కడ కూడా ఇదే తంతు జరిగింది. ఉదయం చుట్టుపక్కల వారు అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు వివరాలు తెలుసుకుని ‘మాకు సంబంధం లేదు.. ముందు ఇక్కడ నుంచి వెళ్లండి’ అని ఆదేశించారు. రాజేందర్‌ అక్కడి నుంచి బయలుదేరి వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో సంప్రదించారు. సుబేదారి పోలీసుల దగ్గరకు వెళ్లమన్నారు. ఏసీపీ జితేందర్‌రెడ్డికి పరిస్థితి రాజేందర్ వివరించారు. 

హోం క్వారంటైన్‌లో ఉన్న వారికి వాహనం పాస్‌ ఇచ్చి ఎలా పంపుతారని ఆయన ప్రశ్నించారు. వారి ఇంట్లో హోం క్వారంటైన్‌లో ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వారికి ఆహారం అందించి ఆటోలోనే బాలాజీ తండాకు వెళ్లమని చెప్పారు. ఏమైనా అవసరమైతే తమను సాయం అడగొచ్చునని అన్నారు. ఎట్టకేలకు రాయపర్తి స్టేషన్‌కు చేరుకున్నారు. ఆర్డీఓతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పారని తెలిపారు. ఇలా 36 గంటల పాటు రాజేందర్ కుటుంబం లాక్ డౌన్ కారణంగా పడరాని కష్టాలు పడింది.