Bowrampet Tiger : అమ్మో పులి..! కాదు కాదు కుక్క.. బౌరంపేట్‌లో పులి సంచారంపై అధికారుల క్లారిటీ
Bowrampet Tiger: ఈ ఏరియాలో పులి వచ్చే చాన్స్ లేదు. భయపడాల్సిన అవసరం లేదు. అక్కడ అడవి లేదు. ఆ ఫుట్ ప్రింట్స్ కానీ షాడో కానీ చూస్తే అది పులి కాదని చెప్పొచ్చు.

Bowrampet Tiger
Bowrampet Tiger : హైదరాబాద్ బౌరంపేట్ లో పులి సంచరిస్తున్నట్లు స్థానిక ప్రజలు భయాందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఫిర్యాదులు అందడంతో దూలపల్లి అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. అక్కడికి వెళ్లి ఆనవాళ్లను సేకరించారు. అక్కడ ఓ కన్ స్ట్రక్షన్ కంపెనీ సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజీని పరిశీలించారు. గేటు దగ్గర కుక్క ఆనవాళ్లు ఉన్నట్లుగా గుర్తించారు. ఈ ప్రాంతానికి పులులు వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. పులి సంచారంపై ఏదైనా సమాచారం ఉంటే ఇవ్వాలని, ప్రజలు భయాందోళకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు అధికారులు.
” బౌరంపేట్ ఔటర్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాల్లో పులి సంచారం అనే వార్త కలకలం రేపింది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ, కొన్ని ఆనవాళ్లను ఫారెస్ట్ అధికారులు సేకరించారు. నిన్న ఉదయం మాకు పోలీస్ డిపార్ట్ నుంచి సమాచారం రాగానే వెంటనే స్పాట్ కి చేరుకున్నాం. అక్కడ ఓ అపార్ట్ మెంట్ నిర్మాణం జరుగుతోంది. అక్కడ సీసీ కెమెరా ఉంది. అందులోని ఫుటేజీని పరిశీలించాము.
Also Read..Tiger : హైదరాబాద్ పరిసరప్రాంతం దుండిగల్ లో పులి సంచారం
గేటు కింద నుంచి ఓ కుక్క వెళ్లింది. దాని నీడ అక్కడ కనిపించింది. అయితే ఇక్కడ పులి మాత్రం లేదు. ఈ ఏరియాలో పులి వచ్చే చాన్స్ లేదు. భయపడాల్సిన అవసరం లేదు. అక్కడ అడవి లేదు. ఆ ఫుట్ ప్రింట్స్ కానీ షాడో కానీ చూస్తే అది పులి కాదని చెప్పొచ్చు. ఆ పక్కనే డాగ్ రెస్క్యూ సెంటర్ ఉంది. కాబట్టి అది పులి కాదు కుక్కే అని మేము అనుకుంటున్నాం. అయితే, ఫుటేజీలో క్లారిటీ లేదు. అది పులా? కుక్కా? అనే స్పష్టత లేదు” అని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ లక్ష్మణ్ తెలిపారు.
”పులి ఉన్నట్లు కొందరు చూపిస్తున్న ఫోటో ఫేక్. అందులో ఎలాంటి సందేహం లేదు. సీసీటీవీ పుటేజీ చూశాము. అయితే, అందులోనూ క్లారిటీ లేదు. కానీ, పులి వచ్చే అవకాశం అయితే లేదు. నర్సాపూర్ పెద్ద ఫారెస్ట్ కాబట్టి నర్సాపూర్ నుంచి వచ్చే చాన్స్ ఉంది. కాకపోతే అలాంటి ఫారెస్ట్ ఇక్కడ అనుకూలంగా లేదు. ప్రజలు అవనసరంగా భయపడొద్దు. ఎలాంటి సమాచారం వచ్చినా వెంటనే మాకు ఇవ్వండి. ఏదైనా సాయం కావాలంటే తప్పకుండా చేస్తాం” అని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ లక్ష్మణ్ తెలిపారు.
అసలేం జరిగిందంటే..
హైదరాబాద్ పరిసర ప్రాంతం దుండిగల్ మున్సిపాలిటీ సమీపంలోని బౌరంపేట ఔటర్ రింగ్ రోడ్ వద్ద పులి సంచారం కలకలం రేపింది. రెండున్నర నిమిషాల వీడియోలో పులి సంచారానికి సంబంధించిన ఆనవాళ్లు లభించాయి. సమాచారం అందుకున్న సూరారం ఫారెస్ట్ సెక్షన్ అధికారి, బీట్ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పులి పాదముద్రల ఆనవాళ్లను అధికారులు సేకరించారు. పులి సంచారం వార్తతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఎప్పుడేం జరుగుతుందోనని కంగారుపడ్డారు. రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు.. అది పులి కాదు కుక్క అని తేల్చడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.