Jeevan Reddy : కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా..
Jeevan Reddy : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. అభిమానులు, అనుచరుల సమక్షంలో రాజీనామా లేఖను విడుదల చేశారు.
Jeevan Reddy
Jeevan Reddy : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. అభిమానులు, అనుచరుల సమక్షంలో రాజీనామా లేఖ విడుదల చేసిన జీవన్ రెడ్డి.. ఆ రాజీనామా లేఖను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గేకు పంపిస్తున్నట్లు ప్రకటించారు.
బుధవారం జగిత్యాలలో తన అభిమానులు, అనుచరులతో జీవన్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ నేతలపై విమర్శలు గుప్పించారు. బాధాతప్త హృదయంతో పార్టీని వీడుతున్నానని జీవనం రెడ్డి ప్రకటించారు. 40ఏళ్ల పాటు పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేశాను. కానీ, నాకుసరైన గౌరవం దక్కలేదు. గత 20 నెలలుగా నన్ను అవమానించి అడుక్కునే స్థాయికి తీసుకొచ్చారని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పదవులు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ, కార్యకర్తల ఆత్మగౌరవం అయినా కాపాడాలి కదా.. పార్టీలో ఏం నడుస్తుంది.. ఏమౌతుందని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి పిసిసి అద్యక్షుడి హోదాలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. శాసన మండలిలో ఒంటరి పోరాటం చేసిన తాను మంత్రిపదవికి అర్హుడిని కాదా..? పదవుల కోసమే అయితే ఆనాడే తాను ప్రొటెక్ట్ చేసేవాడిని. జీవన్ రెడ్డిని ఎలా అణగతొక్కబడాలనేదే మీ ఆలోచన. మీ అడుగులకు మాడుగులొత్తే వారికే పదవులు ప్రాధాన్యత ఇస్తారా అంటూ జీవన్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానాన్ని ప్రశ్నించారు. నాడు చంద్రబాబు, కేసిఆర్‌తో పోరాటం చేశాం.. నేడు రేవంత్ రెడ్డితో పోరాటం చేస్తున్నాం. ఇంకా ఎంతకాలం అవమానాలు, ఇంకా ఎంతకాలం మానసిక క్షోభ. రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా నడిచెటోడిని అణగదొక్కుతున్నావ్ అంటూ రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్టీ మారివచ్చిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారు పదవి ఇస్తారా.. ప్రభుత్వానికి పోచారం ఇచ్చిన సలహాలు ఏమిటి..? వేం నరేందర్ రెడ్డి ఎవరు..? ఎక్కడి నుంచి వచ్చాడు..? వేంనరేందర్ రెడ్డి సలహాలకు అనుగుణంగా ప్రభుత్వం నడుస్తుంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాది అన్నట్లు.. ఎదరిస్తే తొక్కుతా అంటున్నాడు. కార్యకర్తలను గౌరవించడం నేర్చుకో అంటూ జీవన్ రెడ్డి సూచించారు. నా జీవితంలో చివరి వరకు జగిత్యాల ప్రజలకు సేవ చేస్తా. జగిత్యాలలో చేపట్టిన కార్యక్రమాలు కొడంగల్, సిద్ధిపేటలో కూడా లేవు. జాతీయ స్థాయిలో జగిత్యాలకు గుర్తింపు వచ్చేలా కార్యక్రమాలు చేపట్టాం. మా లక్ష్యం ధర్మపోరాటం అంటూ జీవన్ రెడ్డి పేర్కొన్నారు.

Jeevan Reddy Resignation Letter
