Petrol Shortage : నిజంగానే పెట్రోల్ కొరత ఉందా..? ఎందుకు నో స్టాక్ బోర్డులు.. అసలు విషయం చెప్పిన తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్
Petrol Shortage : పెట్రోల్ కొరత కారణంగా బంకులు మూతపడిపోతున్నాయని వస్తున్న వార్తల నేపథ్యంలో తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మర్రి అమరేందర్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయన కీలక సూచనలు చేశారు.
Petrol Shortage
Petrol Shortage : ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. భారతదేశంలోనూ గ్యాస్ కొరత రోజురోజు పెరుగుతోంది. ఎల్పీజీ గ్యాస్ కోసం ఏజెన్సీల వద్ద వినియోగదారులు పడిగాపులు కాస్తున్న పరిస్థితులు తలెత్తాయి. మరోవైపు, పెట్రోల్, డీజిల్ కూడా దొరకడం లేదని, దీంతో పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంక్‌లు నోస్టాక్ బోర్డులు పెడుతున్నాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ సహా పలు జిల్లా కేంద్రాల్లో పెట్రోల్ కోసం వాహనదారులు బారులు తీరుతున్నారు. తాజా పరిణామాలపై తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ స్పందించింది.
తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మర్రి అమరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఫ్యూయల్ కొరతపై వస్తున్న వార్తలు పూర్తిగా అసత్యమని అన్నారు. పెట్రోల్, డీజిల్ నిల్వలు సంవృద్ధిగా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. HPCL, IOCL, BPCL సంస్థల వద్ద పూర్తిస్థాయి స్టాక్ సిద్ధంగా ఉంది..
ప్యూయల్ సరఫరా వ్యవస్థ సాధారణంగా కొనసాగుతోందని తెలిపారు.
పెట్రోల్ కొరత అంటూ తప్పుడు ప్రచారం కారణంగా పెట్రోల్ బంకుల వద్ద 2.5 నుంచి మూడు రెట్లు అధికంగా పెట్రోల్ అమ్మకాలు జరుగుతున్నాయని, అనవసరంగా ట్యాంకులు ఫుల్ చేయించుకోవడంతో కొన్ని బంకుల్లో తాత్కాలికంగా స్టాక్ తగ్గుదల ఏర్పడిందని తెలిపారు. కేన్లలో పెట్రోల్, డీజిల్ నిల్వ చేయడం PESO నిబంధనలకు విరుద్ధమని అన్నారు.
ఇండ్లలో ఇంధనం నిల్వచేయడం వలన అగ్నిప్రమాదాలకు ఎక్కువ ఆస్కారం ఉంటుందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని, ప్యూయరల్ కొరత లేదని, అవసరానికి సరిపడేంత ఫ్యూయల్ మాత్రమే కొనుగోలు చేయాలని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మర్రి అమరేందర్ రెడ్డి సూచనలు చేశారు. తప్పుడు వార్తలను నమ్మొద్దు.. తప్పుడు పోస్టులను ఇతరులకు పోస్టు చేయొద్దు. ప్రజల సహకారంతోనే సరఫరా వ్యవస్థ సజావుగా కొనసాగుతుందని, ఆమేరకు ప్రజలు సహకరించాలని అమరేందర్ రెడ్డి సూచించారు.
