Rain Alert : తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో నేడు భారీ వర్ష సూచన.. ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని వాతావరణ శాఖ సూచన
Rain Alert : తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Rain Alert
- తెలంగాణకు రెయిన్ అలర్ట్,
- నేడు పలు జిల్లాల్లో భారీ వర్ష సూచన
- ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
- అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ
Rain Alert : తెలంగాణలో గత వారం రోజులుగా భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగలు ఎండల తీవ్రత కొనసాగుతుండగా.. సాయంత్రం, రాత్రి వేళల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడుతుండగా.. పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. గంటసేపు ఏకదాటిగా వర్షంపడడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు జిల్లాల్లోనూ మంగళవారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అయితే, ఇవాళ (బుధవారం) కూడా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ పేర్కొంది.
Also Read : Andhrapradesh : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పట్టణ ప్రాంతాల్లోని పొలిటికల్ లీడర్లకు భారీ శుభవార్త..
ద్రోణి ప్రభావం కారణంగా తెలంగాణలో వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.ఈ మేరకు ఆయా ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
ఆదిలాబాద్ నుంచి రంగారెడ్డి వరకు పలు జిల్లాల్లో వర్షాలు, ఈదురుగాలులు ప్రభావం చూపవచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈదురుగాలులు, వర్షం పడే సమయంలో పొరపాటున కూడా చెట్ల కింద ఉండొద్దని, ఇది ప్రాణాప్రాయానికి దారితీస్తుందని తెలిపారు. ఈదురుగాలులు సమయంలో హోర్డింగ్‌లు, విద్యుత్ స్తంభాల వద్ద.. విద్యుత్ తీగలు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని సూచించారు.
మంగళవారం హైదరాబాద్ తోపాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వికారాబాద్, నారాయణపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. హైదరాబాద్ షేక్‌పేటలో 51.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కురిసింది.
