Vijayashanti: సంధ్య థియేటర్ ఘటనపై స్పందించిన విజయశాంతి.. వారిపై తీవ్ర ఆగ్రహం ..
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి స్పందించారు. ఒక సినిమా విడుదల సందర్భంగా జరిగిన దురదృష్ట సంఘటన ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య

Vijayashanthi
Sandhya Theater incident: పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మరణించగా.. ఆమె కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ ఘటన ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో.. ముఖ్యంగా తెలంగాణలో రాజకీయ రంగు పులుముకుంది. ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి జైలుకెళ్లి బెయిల్ పై వచ్చారు. గత శనివారం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అల్లు అర్జున్ సహా సినీ ఇండస్ట్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వెంటనే అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన క్యారెక్టర్ ను తక్కువ చేసి చూపించే ప్రయత్నం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్ నేతలు అల్లు అర్జున్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు నేతలు అల్లు అర్జున్ కు మద్దతుగా మాట్లాడారు. అయితే, ఈ ఘటనకు సంబంధించి తాజా పరిణామాలపై సినీ నటి, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి స్పందించారు.
విజయశాంతి ట్వీట్ ప్రకారం.. ‘‘ఒక సినిమా విడుదల సందర్భంగా జరిగిన దురదృష్ట సంఘటన ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య తెలంగాణల విభజన రేఖలు తెచ్చే వరకు వెళుతున్నట్లు, గత రెండు రోజుల పరిణామాలు, ప్రెస్ మీట్లు తదనంతర భావోద్వేగాలు కనిపిస్తున్నాయి. ప్రాంతాలుగా విడిపోయి ప్రజలుగా కలిసుందాం అనే నాటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, అట్లా కాక మల్లా ప్రజల మనోభావాల మధ్య విభజనలు వచ్చే వరకు నడవాలనేది ఈ సందర్భంగా కొన్ని రాజకీయ పార్టీల ప్రయోగంగా కనిపిస్తుంది అని విజయశాంతి అన్నారు.
ఏది ఏమైనా ఒక సంఘటనను బీజేపీ తమకు అనుకూలంగా చేసుకునే ప్రక్రియగా ఈ అంశాలు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని బీజేపీ నేతల ప్రకటనలను బట్టి అర్ధమవుతుంది. సినిమా పరిశ్రమను నాశనం చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని బీజేపీ కేంద్ర మంత్రులు ఆరోపణలు చేయడం గర్హనీయం. ఇదంతా, అన్ని ప్రాంతాల ప్రజల ఆదరణ కావలసిన సినిమా పరిశ్రమకు ఎంత అవసరం అన్న విశ్లేషణ సినిమా పరిశ్రమ కూడా పరిశీలన చేయాలి. వెంటనే ఈ సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం జరగాలి.’’ అంటూ విజయశాంతి తన ట్వీట్ లో పేర్కొన్నారు.