500 కోట్ల డోసుల సామర్ధ్యం హైదరాబాద్‌ది, ప్రపంచానికే వ్యాక్సిన్లు ఇవ్వగలం

ఏటా ఐదు బిలియన్ డోసుల(500 కోట్లు) వ్యాక్సిన్‌ను తయారు చేస్తూ హైదరాబాద్ ఫార్మా.. వ్యాక్సిన్ క్యాపిటల్‌గా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇది ప్రపంచ ఉత్పత్తిలో మూడోవంతు అని తెలిపారు. కొవిడ్-19 సంక్షోభం నుంచి బయటపడేలా హైదరాబాద్ లైఫ్ సైన్సెస్ పరిశ్రమ గట్టి ప్రయత్నాలు చేస్తోందని, ఆ దిశగా ఇప్పటికే ఫలవంతమైన భాగస్వామ్యాన్ని అందించిందని తెలిపారు. కరోనా వ్యాక్సిన్ అభివృద్ధికి తెలంగాణలో జరుగుతున్న ప్రయత్నాలను వివరిస్తూ, దేశీయంగా బయోటెక్ పరిశ్రమలను ఉన్నతస్థానాలకు తీసుకువెళ్లేందుకు, బయోరంగంలో భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఉన్న అవకాశాలు, తీసుకోవాల్సిన చర్యలను ప్రస్తావిస్తూ మంత్రి కేటీఆర్ గురువారం(ఆగస్టు 6,2020) కేంద్ర ఆరోగ్య, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి హర్షవర్ధన్‌కు లేఖ రాశారు. బయోటెక్ రంగంలో భారత్‌ను అగ్ర స్థానంలో నిలపాలంటే అనుమతుల విషయంలో మరింత సులభంగా ఉండేలా నిబంధనలు రూపొందించాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవసరమని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. కొవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరారు.
కొవిడ్-19 వ్యాక్సిన్ తయారీకి కృషి చేస్తున్న 3 కంపెనీలు:
హైదరాబాద్‌కు చెందిన మూడు కంపెనీలు కొవిడ్-19 వ్యాక్సిన్ తయారీకి కృషి చేస్తున్నాయని.. త్వరలోనే మార్కెట్లోకి వస్తుందని చెప్పడానికి గర్వంగా ఉన్నదని కేటీఆర్ ఆ లేఖలో తెలిపారు. అనేక ఫార్మా కంపెనీలు హైడ్రాక్సీక్లోరోక్విన్ తదితర మందుల తయారీలో పాలు పంచుకొంటున్నాయని తెలిపారు. వ్యాక్సిన్ అనుమతులు, టెస్టింగ్ ట్రాకింగ్ వ్యవస్థను వికేంద్రీకరించాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. తద్వారా క్లినికల్ ట్రయల్స్, వ్యాక్సిన్ల తయారీలో కంపెనీలు మరింత సులభంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుందని వివరించారు.
ఇబ్బందులను తొలగించాలి:
హిమాచల్‌ప్రదేశ్‌లోని కసౌలిలో ఉన్న సెంట్రల్ డ్రగ్ లేబోరేటరీ కేంద్రం బ్రిటిష్ కాలంలో ఏర్పాటు చేసిందని.. ఇప్పటికీ అక్కడే కొనసాగుతుడటం బయోటెక్ కంపెనీలకు కష్టంగా మారుతున్నదని తెలిపారు. లాక్‌డౌన్ సమయంలో శాంపిళ్లను ఈ కేంద్రానికి పంపించడంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని వివరించారు. కరోనా వ్యాక్సిన్ తయారీకి కంపెనీలు వేగంగా పనిచేస్తున్న తరుణంలో వారికి కొంత సులభంగా అనుమతులివ్వాలని సూచించారు. తాత్కాలికంగా ఇచ్చిన వెసులుబాటును శాశ్వతంగా ఉండేలా చూడాలని కోరారు.
సులభంగా ఉండేలా అనుమతులు రూపొందించాలి:
ప్రపంచ బయోటెక్ రంగంలో పోటీతత్వాన్ని తట్టుకోవాలంటే అనుమతులు, క్లియరెన్స్‌లు మరింత సులభంగా ఉండేలా నిబంధనలను రూపొందించాల్సిన అవసరం ఉన్నదని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఆ దిశగా వికేంద్రీకరణకు చర్యలు తీసుకున్న కేంద్రం.. సీడీఎస్‌సీవో జోనల్ కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటుచేయడంపై హర్షం వ్యక్తంచేశారు. ఈ కార్యాలయానికి మరిన్ని అధికారాలు, నిధులు ఇవ్వాలని కోరారు. దేశంలో వ్యాక్సిన్‌ల తయారీకి సుమారు ఆరు కేంద్ర మంత్రిత్వశాఖలు అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని, దీంతోపాటు రాష్ట్రస్థాయిలోనూ ప్రక్రియ ఉంటుందని తెలిపిన మంత్రి కేటీఆర్.. ప్రపంచ పోటీతత్వాన్ని తట్టుకోవాలంటే ఈ క్లిష్టమైన ప్రక్రియను కొంత సులభతరం చేయాలని సూచించారు. కొవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ ప్రక్రియపై ప్రపంచ ఆరోగ్యసంస్థ, ఎఫ్‌డీఏఏ సంస్థలు మార్గదర్శకాలను జారీచేశాయని.. వీటికనుగుణంగా దేశీయంగానూ మార్గదర్శకాలను రూపొందించాలని కోరారు.
మార్కెట్ అనుమతులు:
కరోనా వ్యాక్సిన్ తయారీలో ఇప్పటికే రెండు కంపెనీలు అడ్వాన్స్‌డ్ స్టేజ్‌లో ఉన్నాయని తెలిపిన మంత్రి కేటీఆర్.. వ్యాక్సిన్ ట్రయల్స్‌కు కూడా నూతన మార్గదర్శకాలను విడుదల చేయాలని సూచించారు. కంపెనీలు వ్యాక్సిన్ ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తిచేశాక దానిని పెద్దఎత్తున మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం కల్పించాలని.. తద్వారా పేదలకు అందుబాటులో ఉంటుందని అన్నారు. త్వరలోనే వ్యాక్సిన్ వస్తుందన్న నమ్మకం ఏర్పడుతున్న నేపథ్యంలో కేంద్రం వ్యాక్సిన్ ప్రొక్యూర్‌మెంట్ పాలసీని సిద్ధంగా చేసుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు.
వేగంగా వ్యాక్సిన్ తయారీకి ప్రోత్సాహం:
వ్యాక్సిన్ తయారుచేస్తున్న కంపెనీలకు పీఎం కేర్స్ నిధి ద్వారా కేటాయించిన సుమారు రూ.100 కోట్లను వెంటనే వారికి అందించేందుకు మార్గదర్శకాలను సిద్ధం చేయాలని మంత్రి కేటీఆర్ కోరారు. వ్యాక్సిన్ తయారీలో ముందువరుసలో ఉన్న కంపెనీలను మరింత ప్రోత్సహించేలా నూతన నిధిని ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ప్రపంచ వ్యాక్సిన్ తయారీ రంగంలో భారత్ అగ్రస్థానంలో ఉన్నదని, ఇలాంటి సంక్లిష్ట సమయంలో వేగంగా నిర్ణయాలు తీసుకోకుంటే దానిని కోల్పోయే ప్రమాదం ఉన్నదని తెలిపారు. ఇందుకోసం తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతోపాటు పరిశ్రమవర్గాలతో కమిటీని ఏర్పాటుచేయాలని సూచించారు. ఫార్మా, లైఫ్ సైన్సెస్ ఎకో సిస్టమ్ మరింత బలోపేతం కావాలని కోరుకునే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని, ఇందుకోసం ఎలాంటి సహకారం అందించేందుకైనా సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ హామీ ఇచ్చారు.