హైదరాబాద్‌లో ఓపెన్ ప్లాట్ ఉన్నవారికి బిగ్‌షాక్.. జీహెచ్‌ఎంసీ కమిషనర్ కీలక ఆదేశాలు.. ప్లాట్లలో బోర్డులుసైతం ఏర్పాటు చేస్తున్న అధికారులు..
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని ఖాళీ ప్లాట్ల యాజమానులకు బిగ్ షాకిచ్చింది.

Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని ఖాళీ ప్లాట్ల యాజమానుల నుంచి పన్నులు వసూళ్లు చేసేందుకు సిద్ధమైంది. సాధారణంగా భవనాలు నిర్మించుకున్న తరువాత ఆస్తి పన్ను చెల్లించడం ప్రజలకు అలవాటు, భవనం కట్టకుండా ఖాళీ ప్లాట్‌గా ఎంతకాలం ఉన్నా దానికి పన్ను చెల్లించేందుకు చాలా మంది సుముఖంగా ఉండరు. పన్నులు చెల్లించాలనే విషయం తెలియనివారు కూడా ఎందరో ఉంటారు. అయితే, తాజాగా.. జీహెచ్ఎంసీ అధికారులు ఖాళీ ప్లాట్లకు పన్ను వసూళ్లు చేసేందుకు సిద్ధమయ్యారు. బకాయిలున్నట్లు ప్లాట్లలో బోర్డులు సైతం ఏర్పాటు చేస్తూ ప్లాట్ల యాజమానులకు బిగ్ షాకిస్తున్నారు.
జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 212(2) ఖాళీ స్థలాలపై మేరకు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ (వీఎల్‌టీ) చెల్లించాలి. భూమి ధర మార్కెట్ రేటులో 0.05 శాతంను వీఎల్‌టీగా చెల్లించాల్సి ఉంటుంది. వీఎల్టీ వసూలైతే జీహెచ్ఎంసీకి దాదాపు రూ.110 కోట్ల మేర ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
వీఎల్టీ చెల్లించాల్సిన ఖాళీ స్థలాల వివరాలను ఆన్ లైన్ లో పొందుపర్చారు. డిప్యూటీ కమిషనర్లకు వసూళ్ల బాధ్యత అప్పగించారు. ప్రతి బిల్ కలెక్టర్, ట్యాక్స్ ఇన్ స్పెక్టర్లకు రోజువారీ టార్గెట్ విధించి వసూళ్ల చర్యలు తీసుకోవాల్సిందిగా కమిషనర్ సూచించారు. మరోవైపు.. ఇప్పటికే ఆన్‌లైన్‌లో నమోదైన ఖాళీ ప్లాట్లలో ఆ ప్లాట్ నుంచి చెల్లించాల్సిన వీఎల్టీ చెల్లించలేదనే ప్లెక్సీ బోర్డును అధికారులు ఏర్పాటు చేయడంతోపాటు అసెస్ కాని ఖాళీ స్థలాలను కూడా క్షేత్ర స్థాయిలో గుర్తించి వాటిని ట్యాక్స్ జాబితాలోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు.
వీఎల్టీ వసూళ్ల ద్వారా జీహెచ్ఎంసీకి ఆదాయంతోపాటు, ఖాళీ ప్లాట్లలో చెత్తాచెదారం, వ్యర్థాల నిల్వలు ఉండకుండా ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. ఖాళీ స్థలాలు ఉండటం వల్ల అన్ని రకాల వ్యర్థాలతోపాటు నిల్వ నీటితో దోమల వ్యాప్తి పెరుగుతుంది.. తద్వారా అనేక మంది రోగాల భారిన పడుతున్న పరిస్థితి. ఖాళీ ప్లాటయినా దానికి పన్ను కడితే యాజమానులు దాన్ని జాగ్రత్తపర్చుకుంటారని, తద్వారా ఈ సమస్యలు కూడా తీరుతాయని అధికారులు భావిస్తున్నారు.