గ్రేటర్ ఎన్నికలు : TRS Vs BJP డైలాగ్ వార్

TRS Vs BJP Dialogue War : గ్రేటర్‌లో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. నేతలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కొంతమంది ఇంటింటి ప్రచారం నిర్వహిస్తుంటే… మరికొందరు రోడ్‌షోలతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. దీంతో గ్రేటర్ ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. బల్దియా ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్ దూసుకెళ్తోంది. మంత్రి కేటీఆర్ రోడ్‌షోలతో ఆకట్టుకుంటున్నారు. రోజూ రెండు నియోజకవర్గాల్లో రోడ్‌షోలతో ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను ఓట్లడుగుతున్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై పదునైన విమర్శలు చేస్తున్నారు. బల్దియాలో ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ అగ్రనేతలు తరలిరావడంపై కేటీఆర్ తనదైన శైలిలో విమర్శించారు.
https://10tv.in/minister-ktr-setires-on-bjp-manifesto/
బీజేపీ జాతీయనేతలంతా హైదరాబాద్‌కు క్యూ కట్టారని… వాళ్ల రాక చూస్తోంటే…ఇవి పార్లమెంట్ ఎన్నికలో, జీహెచ్‌ఎంసీ ఎన్నికలో అర్థంకావడం లేదన్నారు. బీజేపీ నేతలు గుంపులు గుంపులుగా వచ్చినా… సింహం సింగిల్‌గా వచ్చినట్టు కేసీఆర్ ఒక్కరే వస్తారని అన్నారు. హైదరాబాద్‌లో వరదలు వచ్చినప్పుడు ఇప్పుడు వస్తోన్న బీజేపీ అగ్రనేతలు ఎక్కడ ఉన్నారని కేటీఆర్ ప్రశ్నించారు. ఎన్నికలప్పుడు చేతులు ఊపుకుంటూ హైదరాబాద్‌కు వస్తే కుదరదన్నారు. వరదల కారణంగా హైదరాబాద్ ప్రజలు నష్టపోయిన 1350 కోట్ల రూపాయలు తీసుకొని రావాలని కోరారు. లేకుంటే ప్రజలే మీ అంతు తేల్చుతారని హెచ్చరించారు.
టీఆర్‌ఎస్ నేతల ఆరోపణలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. తమ పార్టీ జాతీయ నేతలు హైదరాబాద్‌కు రానివ్వకుండా ఉండేందుకు టీఆర్‌ఎస్ నేతలు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ మత విద్వేషాలు రగిలించడానికి పథకం పన్నారని ఆరోపించారు. పోలీసు అధికారులకు హెచ్చరికలు చేసిన బండి సంజయ్.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ప్రవర్తిస్తే .. అదే శాంతి భద్రతల సమస్యగా మారే అవకాశముందన్నారు. గ్రేటర్‌లో గెలవడమే లక్ష్యంగా అధికార టీఆర్‌ఎస్, విపక్ష బీజేపీ మధ్య రోజురోజుకు డైలాగ్ వార్ ముదురుతోంది. నేతల పరస్పర విమర్శలతో గ్రేటర్ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా మారుతోంది.