బీసీలపై ఫోకస్ పెట్టిన బీజేపీ, ఎందుకో తెలుసా

Ghmc Elections 2020 BJP Plan : గ్రేటర్‌లో పాగా వేసేందుకు.. ఆ పార్టీ భారీ ప్లానే వేసింది. ప్రత్యేకంగా.. 2 సామాజికవర్గాలపై ఇంతకుముందెన్నడూ లేనంత ఫోకస్ పెట్టింది. ఇతర పార్టీల్లో ఉన్న ఆ సామాజికవర్గాల నాయకులను కూడా.. కాషాయం కండువా కప్పేందుకు ప్రయత్నాలు మొదలెట్టేశారు. ఈ మధ్యకాలంలో మున్నూరు కాపు పార్టీగా పడిన ముద్రను తొలగించుకునేందుకు చాలానే చేస్తున్నారు. బీజేపీ.. ఎస్.. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు బీసీలపై ఫోకస్ పెట్టింది. మున్నూరు కాపు పార్టీగా పడిన ముద్రను తొలగించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు ముఖ్యనేతలు. ఇతర పార్టీల్లోని.. బీసీ సామాజికవర్గ నాయకులను తమ పార్టీలోకి లాగేందుకు ప్రయత్నాలు చేస్తోంది కాషాయ పార్టీ నాయకత్వం.
2014కు ముందు నుంచే.. బీసీ వర్గాలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. ఇందులో భాగంగానే.. రాష్ట్ర బీజేపీ పగ్గాలను లక్ష్మణ్‌కు అప్పగించింది అధిష్టానం. టీఆర్ఎస్‌కు వెలమల పార్టీ అని, కాంగ్రెస్.. రెడ్డి కాంగ్రెస్ అనే ముద్ర ఉంది. దీంతో.. బీసీలకు దగ్గరయ్యే క్రమంలో.. బీజేపీ ఈ మధ్యకాలంలో మున్నూరు కాపు పార్టీగా మారిపోయింది. అధ్యక్షుడు బండి సంజయ్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్‌తో పాటు కీలకమైన పదవులన్నీ మున్నూరు కాపు వారికే వచ్చాయని.. రాష్ట్ర కమిటీ ఏర్పాటు సమయంలో కమలనాథుల్లో గుసగుసలు వినిపించాయి. మున్నూరుకాపు పార్టీగా పడిన ముద్రను తొలగించుకునేందుకు.. బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తోంది.
ఇందుకోసం.. బలమైన ఇతర బీసీ కులాలపై ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ మహానగరంలో బలంగా ఉండే యాదవ, ముదిరాజ్, గౌడ కులాల నేతలను పార్టీలో చేర్చుకొని.. వారికి టికెట్లు ఇవ్వాలనే యోచనలో ఉంది.
బీజేపీ రాష్ట్ర కమిటీ ఏర్పాటు సమయంలో.. యాదవులకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదంటూ.. యాదవ సంఘాలు పార్టీ ఆఫీస్ ముట్టడించే ప్రయత్నం చేశాయి. దీంతో.. యాదవ సామాజికవర్గంపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టింది కమలం పార్టీ. గ్రేటర్ ఎన్నికల్లో.. యాదవులకు సముచిత స్థానం కల్పించే దిశగా ప్రణాళికలు రూపొందించారు.
కాంగ్రెస్‌లోని.. యాదవ సామాజికవర్గానికి చెందిన ముఖ్యనేతలను కమలం గూటికి చేర్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది బీజేపీ నాయకత్వం. ఇప్పటికే శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్, ఆయన కుమారుడు.. కాంగ్రెస్‌కు రాజీనామా చేసేశారు. ఏ సమయంలోనైనా కాషాయం కండువా కప్పుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
ఇక.. ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ ఛైర్మన్.. సుదర్శన్ ముదిరాజ్‌ను కూడా పార్టీలో చేర్చుకున్నారు. ఆయన కోడలు వీణామాధురికి ఖైరతాబాద్ టికెట్ సైతం ఇచ్చేశారు. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన గంగాధర్ గౌడ్‌కు.. బేగంపేట డివిజన్ టికెట్ కేటాయించారు. ఇక.. టీఆర్ఎస్ నుంచి బీజేపీలో గూటికి చేరిన కాసోజు విద్యాసాగర్ చారికి చర్లపల్లి డివిజన్ టికెట్ ఇస్తున్నట్లు సమాచారం. బీసీలను ఆకర్షించేందుకు.. బీజేపీ అన్నిరకాల శక్తులను ఒడ్డుతోంది. జనాభాలో కీలకంగా ఉన్న బీసీ సామాజికవర్గ నేతలను ఆకర్షించి.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టికెట్లు కూడా వారిగే ఎక్కువగా ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.