నవంబర్, డిసెంబర్ లో జీహెచ్ఎంసీ ఎన్నికలు

GHMC elections : తెలంగాణలో త్వరలోనే ఎన్నికల సందడి నెలకొననుంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు పార్టీలు ఇప్పటి నుంచే సిద్ధమౌతున్నాయి. ఏ క్షణమైనా ఎన్నికలు వచ్చే అవకాశం ఉందనే సంకేతాలు వస్తున్నాయి. అయితే..దీనిపై తెలంగాణ ఎన్నికల కమిషనర్ పార్థ సారధి క్లారిటీ ఇచ్చారు. ఇంకా తేదీలను ఖరారు చేయలేదని స్పష్టం చేశారు. 2020, అక్టోబర్ 07వ తేదీ తిరుమలకు వచ్చిన ఆయన..శ్రీ వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో ఎన్నికలు జరుగుతాయని, నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు.
ఎప్పుడెప్పుడు జరుగుతాయని పార్టీలు ఎదురు చూస్తున్నాయి. రాష్ట్రంలో రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి. హైదరాబాద్ లో పార్టీలు ఎన్నికలకు సన్నద్ధమయ్యాయి. పార్టీ కేడర్ ను అలర్ట్ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించాలని పిలుపునిస్తున్నాయి.
మరోసారి గ్రేటర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని అధికార పార్టీ వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగా మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్..మీటింగ్స్ జరుపుతున్నారు. ఇటీవలే నిర్వహించిన సమావేశంలో అంతగా దృష్టి సారించని కార్పొరేటర్స్ పై ఆగ్రహం చేశారు. ప్రజల వద్దకు వెళ్లాలని, వారి సమస్యలను అడిగి..పరిష్కరించాలని సూచిస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వారికి వివరించాలంటున్నారు. మరోవైపు…బీజేపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి లీడర్స్, కార్యకర్తలకు సూచనలు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తోంది.
బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.
గ్రేటర్ హైదరాబాద్ మునిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలను బ్యాలెట్‌తో నిర్వహించడానికే ఎక్కువ పార్టీలు మొగ్గు చూపాయి. ఈవీఎంలతో నిర్వహిస్తే సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశాలుంటాయని, వాటిని అంతగా విశ్వసించలేమని అభిప్రాయపడ్డాయి.
అధికార టీఆర్‌ఎస్ తో పాటు సీపీఐ, సీపీఎం, టీడీపీలు బ్యాలెట్ పద్ధతినే కోరుకున్నాయి. బీజేపీ మాత్రం ఈవీఎంలతోనే ఎన్నికలు నిర్వహించాలంటూ పట్టుబట్టింది. ఈ మేరకు రాష్ట్రంలోని ఆయా రాజకీయ పార్టీల నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) అభిప్రాయాలను సేకరించింది.