Telangana New Schemes: తెలంగాణ ప్రజలకు శుభవార్త.. ఆగస్టు 15న సర్కార్ మూడు కానుకలు.. వారందరికీ లబ్ధి..
Telangana New Schemes : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఆగస్టు 15న మూడు సంక్షేమ పథకాలు అమల్లోకి రానున్నాయి.
Telangana People Government To Launch Three Welfare Schemes On August 15
Telangana New Schemes : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా సంక్షేమ పథకాల పంపిణీకి సర్కార్ శ్రీకారం చుట్టబోతోంది. స్మార్ట్ రేషన్ కార్డులు, నూతన పింఛన్ల పంపిణీని ప్రారంభించనుంది. అంతేకా అసంఘటిత రంగంలోని గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం తీసుకొచ్చిన చట్టాన్ని కూడా అదేరోజు నుంచి అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది.
రేషన్ లబ్ధిదారులకు ల్యామినేటెడ్ కార్డుల పంపిణీని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగారెడ్డి జిల్లాలో అధికారికంగా ప్రారంభించనున్నారు. అదే సమయంలో రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఏకకాలంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.06కోట్ల కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు.. రాష్ట్రంలో అర్హులైన వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులందరికీ పూర్తిస్థాయిలో పింఛన్లు మంజూరు చేయాలని, దివ్యాంగులైన పింఛనుదారులు మరణిస్తే వారి భార్యలకు తక్షణమే ఆ ప్రయోజనం వర్తింపజేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీంతో పాటు తలసేమియా, సికిల్ సెల్ అనీమియా రోగులకు కూడా సామాజిక పింఛన్లు ఇవ్వాలని ఆదేశించడంతో ఆ మేరకు అధికారులు చర్యలు ముమ్మరం చేశారు.
రాష్ట్రంలోని డెలివరీ బాయ్స్, రవాణా కార్మికులకు భద్రత కల్పించే గిగ్ వర్కర్ల చట్టాన్ని కూడా ఆగస్టు 15వ తేదీ నుంచే అమలు చేసేందుకు కార్మిక శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. డిజిటల్ ప్లాట్ ఫామ్ గిగ్ వర్కర్ల భద్రత కోసం ఈనెల 15వ తేదీ నాటికి సంక్షేమ బోర్డు సేవలను ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
