గుడ్‌న్యూస్.. వాళ్లందరికీ కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయ్.. రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీకి ఏర్పాట్లు.. లిస్ట్‌లో మీపేరు కోసం ఇలా చెక్ చేసుకోండి..

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి అర్హులైన ప్రతిఒక్కరికీ రేషన్ కార్డు అందించడంపై దృష్టిసారించింది.

గుడ్‌న్యూస్.. వాళ్లందరికీ కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయ్.. రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీకి ఏర్పాట్లు.. లిస్ట్‌లో మీపేరు కోసం ఇలా చెక్ చేసుకోండి..

Updated On : July 13, 2025 / 10:36 AM IST

Ration Cards: రాష్ట్రంలో అర్హత కలిగిన వారందరికీ కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది. సోమవారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి అర్హులైన ప్రతిఒక్కరికీ రేషన్ కార్డు అందించడంపై దృష్టిసారించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సమయంలో రాష్ట్రంలో 89.95 లక్షల ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన తరువాత జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రకటన చేశారు. అప్పటి నుంచి మే 23వ తేదీ వరకు కొత్తగా 2.03లక్షల కార్డులు జారీ అయ్యాయి. ఆ తరువాత మే 24 నుంచి ఇప్పటి వరకు మరో 3.58లక్షల కార్డులను ఆన్‌లైన్‌లో జారీ చేశారు. ఇప్పటి వరకు జారీ చేసిన కార్డుల సంఖ్య 5,61,343గా తేల్చారు. దీంతో రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య 95,56,625గా పౌరసరఫరాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

రాష్ట్రంలో పది జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులు ఎక్కువగా పంపిణీ చేయబోతుంది కాంగ్రెస్ సర్కార్. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 50,102 కొత్త రేషన్ కార్డులు రాబోతున్నాయి. ఆ తరువాత కరీంనగర్ జిల్లాలో 31,772 కొత్త కార్డులను పంపిణీ చేయనున్నారు. కొత్త కార్డుల జారీ తరువాత అత్యధికంగా (6,67,778) రేషన్ కార్డులు కలిగిఉన్న జిల్లాగా హైదరాబాద్ నిలవనుంది. అయితే, పేదళ్ల తరువాత కొత్త రేషన్ కార్డులు వస్తుండటంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఆన్‌లైన్‌లో స్టేటస్ ఎలా చెక్ చేయాలి?
కొంతమంది తమ దరఖాస్తు అప్రూవ్ అయిందా? లేదా? అన్న సందేహంలో ఉన్నారు. అటువంటి వారు ఆన్లైన్‌లో సులభంగా తమ రేషన్ కార్డు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్
https://epds.telangana.gov.in/FoodSecurityAct/ ను ఓపెన్ చేయండి. ఆ తరువాత FSC Search ఆప్షన్‌పై క్లిక్ చేయండి. Ration Card Search అని వచ్చే ఆప్షన్‌లోకి వెళ్లండి. అక్కడ FSC Application Searchను ఎంచుకోండి. తెరపై MeeSeva Application Search విండో ఓపెన్ అవుతుంది. మీ జిల్లా ఎంచుకుని, మీ సేవా నంబర్ లేదా అప్లికేషన్ నంబర్ ఎంటర్ చేయండి. Search క్లిక్ చేస్తే మీ దరఖాస్తు స్టేటస్ కనిపిస్తుంది. Approved అని వస్తే మీకు కార్డు మంజూరైనట్లే. Pending అంటే ఇంకా పరిశీలనలో ఉందని అర్ధం.