Padi Kaushik Reddy: వ్యూహమా? దూకుడుకు కళ్లెమా? ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సడెన్ గా ఎందుకు సైలెంటయ్యారు..
అధికార కాంగ్రెస్, బీజేపీకి సంబంధించిన ఏ అంశాన్ని వదిలిపెట్టని కౌశిక్ రెడ్డి..బండి భగీరథ్ ఇష్యూపై మాత్రం రియాక్ట్ కాకపోవడం చర్చనీయాంశమవుతోంది.
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దూకుడుకు బ్రేక్.!
- బండి సంజయ్‌తో వివాదం తర్వాత లో-ప్రొఫైల్ మోడ్
- బండి భగీరథ్ ఇష్యూపై రియాక్ట్ కాని కౌశిక్ రెడ్డి
- కౌశిక్‌రెడ్డి మౌనం వెనుక వ్యూహం ఉందా?
- లేకపోతే బీఆర్ఎస్ పెద్దలే కౌశిక్‌కు కళ్లెం వేశారా?
Padi Kaushik Reddy: ఇష్యూ ఏదైనా? అది అధికార పార్టీపై అటాక్ అయినా..బీజేపీ నేతలపై దూకుడు చూపాలన్నా ..ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆల్వేస్ రెడీ టు ఫైర్ అంటుంటారు. అలా ఆయన కేరాఫ్ కాంట్రవర్సీగా కూడా మారిపోయారు. అయితే గత కొద్దిరోజులుగా ఆయన పూర్తిగా సైలెంట్ అయిపోయారట. బయట ఇంత రచ్చ జరుగుతున్నా ఆయన మాత్రం..తెరమీదకు రావట్లేదు. ఇంతకు ఎవరా ఎమ్మెల్యే.? ఆయన దూకుడుకు ఎక్కడ బ్రేక్ పడింది.?
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కొన్ని రోజులుగా రాజకీయంగా లో-ప్రొఫైల్ మెయింటెన్ చేస్తుండటం హాట్ టాపిక్‌గా మారింది.. కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై ఆయన చేసిన కామెంట్స్, ఆ తర్వాత బీజేపీ కార్యకర్తల దాడి తర్వాత మీడియా ముందుకొచ్చిన కౌశిక్ రెడ్డి..ఇప్పుడు సైలెంట్ మోడ్‌లో ఉండటం, లో ప్రొఫైల్ మెయింటెన్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ కౌశిక్ రెడ్డి మౌనం రాజకీయ వ్యూహమా.? లేక బీఆర్ఎస్ పెద్దలే ఆయన దూకుడుకు కళ్లెం వేశారా అనేది రాజకీయవర్గాల్లో చర్చకు దారి తీస్తోంది.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఫోకస్ పెట్టాలని ఆదేశాలు..
సాధారణంగా ప్రతి ఇష్యూపై దూకుడుగా స్పందించే కౌశిక్‌రెడ్డి, బండి భగరీథ్ కేసుపై ఒక్కసారి కూడా రియాక్ట్ కాలేదు. అధికార కాంగ్రెస్, బీజేపీకి సంబంధించిన ఏ అంశాన్ని వదిలిపెట్టని కౌశిక్ రెడ్డి..బండి భగీరథ్ ఇష్యూపై మాత్రం రియాక్ట్ కాకపోవడం చర్చనీయాంశమవుతోంది. అది కూడా ఇష్యూ వెలుగులోకి రావడానికి రెండు రోజుల ముందే బండి సంజయ్ అనుచరులు కౌశిక్‌పై దాడి కూడా చేశారు. ఆయన వాహనాన్ని గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయం ముందే ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో మామూలుగా అయితే కౌశిక్ రెడ్డి బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించడంలో ముందుండే వారే. కానీ ఇప్పుడు మౌనం పాటించడం వెనుక ఏవో రాజకీయ లెక్కలు ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
కరీంనగర్లో దాడి తర్వాత కౌశిక్ రెడ్డిపై కూడా న్యాయపరమైన, శాంతిభద్రతల పరమైన ఒత్తిడి పెరిగిందంటున్నారు. మరింత దూకుడుగా మాట్లాడితే..సమస్యలు వచ్చే అవకాశం ఉందని భావించే ఆయన కాస్త సైలెంట్ అయినట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రతి వివాదంలో వ్యక్తిగత విమర్శలు, దాడులకంటే, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఫోకస్ పెట్టాలని పార్టీ అధిష్టానం నుంచి కౌశిక్‌కు ఆదేశాలు వచ్చాయని తెలుస్తోంది.
ఇక కరీంనగర్ రాజకీయాల్లో బీజేపీ-బీఆర్ఎస్ మధ్య పోటీ వ్యక్తిగత స్థాయికి వెళ్లింది. ఇటువంటి సమయంలో మరింత దూకుడుగా వెళితే సానుభూతి బీజేపీ వైపు వెళ్లే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ అంచనా వేసి ఉండొచ్చని అంటున్నారు. ముఖ్యంగా కారుపై దాడి ఘటనతో కౌశిక్ రెడ్డికి కొంత సానుభూతి వచ్చిన నేపథ్యంలో, ఆ ఇష్యూను మరింత లాగితే రివర్స్ అయ్యే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ అధిష్టానం భావించినట్లు టాక్. అందుకే పాడి కౌశిక్ రెడ్డి మౌనం ద్వారా రాజకీయ లాభనష్టాలను లెక్కగడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియా హవా నడుస్తుండటంతో నాయకులు ఏం మాట్లాడినా అది వెంటనే వైరల్ అయిపోతోంది. ఇటువంటి సమయంలో కొన్ని సందర్భాల్లో అది చట్టపరమైన సమస్యలకు కూడా దారితీసే పరిస్థితి ఉంటుంది.
కౌశిక్ దూకుడు కన్నా..మౌనమే మంచిదనే ఫీడ్ బ్యాక్..!
తెలంగాణలో హేట్ స్పీచ్‌లపై కఠిన చట్టాల దిశగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో నేతలు కూడా జాగ్రత్తగా ఉంటున్నారట. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మౌనం వెనుక భయం కంటే రాజకీయ వ్యూహమే ఎక్కువగా ఉందనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు కౌశిక్ దూకుడు కన్నా..ఆయన మౌనమే బీఆర్ఎస్కు మంచిదనే ఫీడ్ బ్యాక్‌తోనే ఆయనను పార్టీ పెద్దలు సైలెంట్ మోడ్‌లోకి తీసుకెళ్లారనే టాక్ నడుస్తోంది.
Also Read: తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా..
