Sunil Kanugolu – Prashant Kishor: కాంగ్రెస్ కోసం కనుగోలు.. బీఆర్ఎస్ కోసం PK! 2028 ఎన్నికలకు ఇప్పటినుంచే పార్టీల స్ట్రాటజీలు..
పార్టీకి, ప్రభుత్వానికి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని.. దీనికి ఫుల్స్టాప్ పెట్టాలని సీఎం రేవంత్ భావిస్తున్నారట. ప్రభుత్వ పథకాలు కూడా.. జనాల్లోకి పెద్దగా వెళ్లడం లేదనే ఆలోచనలో ఉన్నారు.
- వ్యూహకర్తలు ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారా?
- కోర్ టీమ్‌ను బలోపేతం చేసే పనిలో సీఎం రేవంత్..
- సునీల్ కనుగోలును రంగంలోకి దించే ప్రయత్నం!
- PK సేవలు వినియోగించుకోవాలని బీఆర్ఎస్..
- తెలంగాణ రాజకీయం నెక్ట్స్ లెవల్‌కు చేరనుందా ?
Sunil Kanugolu – Prashant Kishor: అసెంబ్లీ ఎన్నికలకు రెండేళ్లకు పైగా టైమ్ ఉన్నా.. యుద్ధం మొదలైంది అనే రేంజ్ లో తెలంగాణలో పార్టీల వ్యూహాలు కనిపిస్తున్నాయ్. గ్రౌండ్ లెవల్లో పార్టీని స్ట్రాంగ్ చేసేందుకు.. అటు కాంగ్రెస్.. ఇటు బీఆర్ఎస్.. ఎవరికి వాళ్లు పక్కా స్ట్రాటజీలతో వ్యూహంతో ముందుకు వెళ్తున్నాయ్. ఇందుకోసం రెండున్నరేళ్ల ముందు నుండే వ్యూహకర్తలను కూడా రంగంలోకి దింపేందుకు రెడీ అవుతున్నాయని టాక్. కాంగ్రెస్ కోసం సునీల్ కనుగోలు.. బీఆర్ఎస్ కోసం ప్రశాంత్ కిషోర్ మరోసారి తెలంగాణలో ఎంటర్ కాబోతున్నారనే గుసగుస.. తెలంగాణ రాజకీయాన్ని హీటెక్కిస్తోంది. ఇది నిజమేనా.. అసలేం జరుగుతోంది.. ఏ పార్టీ అడుగులు ఎలా ఉండబోతున్నాయ్..
అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్లకు పైగా సమయం ఉన్నా.. ఇప్పటి నుంచే తెలంగాణ రాజకీయం సెగలు కక్కుతోంది. 2028 ఎన్నికల్లో గెలుపు కోసం.. పార్టీలన్నీ వ్యూహ ప్రతివ్యూహాలు సిద్ధం చేస్తున్నాయ్. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య యుద్ధం ఇప్పటికే పీక్స్‌లో కనిపిస్తోంది. ఐతే పార్టీకి, ప్రభుత్వానికి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని.. దీనికి ఫుల్స్టాప్ పెట్టాలని సీఎం రేవంత్ భావిస్తున్నారట. ప్రభుత్వ పథకాలు కూడా.. జనాల్లోకి పెద్దగా వెళ్లడం లేదనే ఆలోచనలో ఉన్నారు. ఇకపై గేర్ మార్చాల్సిందేనని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. దీనికోసం గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యూహాకర్తగా పనిచేసి.. విజయానికి సహకరించిన సునీల్ కనుగోలు వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వానికి, పార్టీకి మధ్య కో ఆర్డినేషన్ పెంచడం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నేతల మధ్య కమ్యూనికేషన్‌ను మెరుగుపరచడం కోసం.. తన కోర్ టీమ్ లో కనుగోలును సీఎం చేర్చుకోబోతున్నారని.. ఆయనకు కీలక బాధ్యత అప్పగించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.
2023 ఎన్నికల్లో విజయం వెనుక సునీల్ కనుగోలు వ్యూహాలు..
2023 ఎన్నికల్లో అధికారం చేపట్టడం వెనక సునీల్ కనుగోలు వ్యూహాలు కీలకంగా పని చేశాయని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. సోషల్ మీడియా క్యాంపెయిన్లు, గ్రామ స్థాయి వార్ రూమ్ వ్యవస్థ, మార్పు కావాలి లాంటి నినాదాలు… హస్తం పార్టీకి మంచి మైలేజ్ తీసుకొచ్చాయ్. ఐతే ప్రభుత్వ ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ ప్రచార యంత్రాంగం ఆశించిన స్థాయిలో పని చేయడం లేదని.. సంక్షేమ పథకాలను జనాల్లోకి తీసుకెళ్లడంలో విఫలం అవుతున్నామని పలువురు నేతలు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్, బీజేపీతో కంపేర్ చేస్తే సోషల్ మీడియాలో కాంగ్రెస్ స్లోగా ఉందన్న ఫీడ్ బ్యాక్ వెళ్లిందట. ఈ గ్యాప్‌ను భర్తీ చేయాలంటే.. సునీల్ కనుగోలుకు కీలక బాధ్యతలు ఇవ్వాలని చూస్తున్నారట సీఎం రేవంత్. త్వరలో రానున్న గ్రేటర్, కార్పొరేషన్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని.. కేడర్‌ను స్ట్రాంగ్ చేయాలని సీఎం ఫిక్స్ అయ్యారు. దీనికోసం సునీల్ కనుగోలును దింపాలనే ప్లాన్ చేస్తున్నారట.
సిద్ధరామయ్య రాజీనామాతో తెలంగాణపై మళ్లీ కన్ను..
కర్ణాటకలో సిద్ధరామయ్యకు ఇప్పటివరకు సునీల్ కనుగోలు సలహాదారుగా పనిచేస్తున్నారు. సిద్దరామయ్య రాజీనామాతో కనుగోలు కన్ను మళ్లీ తెలంగాణపై పడినట్లు తెలుస్తోంది. గతంలో రేవంత్ తో ఉన్న సన్నిహిత సంబంధాలతో మరోసారి తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ చేసేందుకు సునీల్ కనుగోలు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అటు AICC కీలక నేతలతో ఆయనకు మంచి అనుబంధం ఉండటంతో.. ఢిల్లీ హైకమాండ్‌తో తెలంగాణ కాంగ్రెస్‌కు సమన్వయం మరింత బలోపేతం అవుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయ్. ఇక సోషల్ మీడియా విషయంలో మంచి ఎక్స్పర్ట్ అయిన సునీల్.. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీకి చాలా కీలకమని సీఎం భావిస్తున్నారు. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ దాడిని ఎదుర్కోవాలంటే.. ఆయన అయితేనే బెస్ట్ అని అనుకుంటున్నారట. ఓవరాల్‌గా కనుగోలు ఎంట్రీ దాదాపు కన్ఫార్మ్ అయినట్లే అనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. కర్ణాటక సీఎంకు సలహాదారుగా ఉన్నట్టుగానే.. ఇక్కడ కూడా తెలంగాణ సీఎం సలహాదారు పోస్ట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది.
కారు పార్టీ కోసం ప్రశాంత్ కిషోర్ దిగుతారనే ప్రచారం..
ఇక వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం దక్కించుకోవాలని ప్లాన్ చేస్తున్న బీఆర్ఎస్… దూకుడు మీద కనిపిస్తోంది. కాంగ్రెస్ కోసం కనుగోలు ఎంటర్ అవుతున్నట్లు.. కారు పార్టీ కోసం ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగుతారనే ప్రచారం జరుగుతోంది. ఐప్యాక్ అధినేతగా.. రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ కు మంచి పేరుంది. 2014లో ప్రధాని మోదీ విజయంలో.. 2019లో ఏపీలో జగన్ గెలుపులోనూ ఆయన కీలకంగా పనిచేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఆయనతోనూ మంచి సంబంధాలే కొనసాగించారు. మరోసారి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ప్రశాంత్ కిషోర్ సేవలను వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి పీకేతో ఇప్పటికే కొందరు కారు పార్టీ నేతలు చర్చలు కూడా జరిపినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయ్.
రేవంత్‌ను మరోసారి అధికారంలోకి రానివ్వనంటూ శపథం..
అన్నీ అనుకున్నట్లు అయితే.. త్వరలోనే బీఆర్ ఎస్ కు మద్దతుగా పని చేసేందుకు ప్రశాంత్ కిషోర్ ముందుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో రేవంత్ ను తెలంగాణలో మరోసారి అధికారంలోకి రానివ్వనంటూ .. బిహార్ ఎన్నికల సమయంలోనే ప్రశాంత్ కిషోర్ శపథం చేశారు. ఇక అటు బీఆర్ఎస్ కూడా అధికారం కోసం వ్యూహాలు రచిస్తోంది. దీంతో కాంగ్రెస్ ను గద్దె దించేందుకు బీఆర్ఎస్ కు సపోర్టుగా నిలిచేందుకు ప్రశాంత్ కిషోర్ సిద్ధం అయినట్లు తెలుస్తోంది. అటు కనుగోలు.. ఇటు ప్రశాంత్ కిషోర్ ఎంటర్ అయితే.. తెలంగాణ రాజకీయం మరింత రసపట్టుగా మారే చాన్స్ ఉంటుంది. పాలిటిక్స్ నెక్ట్స్ లెవల్ కు చేరుకోవడం ఖాయం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.
Also Read: డీకే శివకుమార్ సీఎం అయితే.. ఆ లిస్ట్ లో చంద్రబాబుకు సెకండ్ ప్లేస్..!
