Gossip Garage : అంతా సర్దుకున్నట్లేనా? ఎమ్మెల్యేలు చల్లబడినట్లేనా? ఇంతకీ సీఎల్పీ భేటీలో తేలిందేమిటి..
ప్రతీ రెండు నెలలకోసారి సీఎల్పీ సమావేశం ఉంటుందని ..ఎమ్మెల్యేలకు సమస్యలు ఉంటే ఆ భేటీలోనే చెప్పుకోవాలని సూచించారట పార్టీ పెద్దలు. రహస్య మీటింగ్‌లు, ప్రత్యేక సమావేశాలు పెట్టుకుని మీడియాకు ఎక్కొద్దని కోరారట.

Gossip Garage : ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్. ఈ ఒక్క లైన్ కాంగ్రెస్ పార్టీలో కల్లోలం రేపింది. అలర్ట్ అయిన పార్టీ, ప్రభుత్వ పెద్దలు.. సడెన్‌గా ఎమ్మెల్యేలతో ప్రత్యేక భేటీ అన్నారు. ఆల్ ఆఫ్ సడెన్‌గా ఎమ్మెల్యేలతో మీటింగ్ అనగానే పెద్ద చర్చే జరిగింది. దీంతో కవర్ డ్రైవ్ స్టార్ట్ చేసిన కాంగ్రెస్.. సీఎల్పీ భేటీగా మార్చేసింది. ఫైనల్‌గా సమావేశం అయితే నిర్వహించారు. పార్టీ పెద్దలు చెప్పాల్సింది చెప్పారు. ఎమ్మెల్యేలు తమ ప్రాబ్లమ్స్ ఏంటో వివరించారు. ఇంతకీ ఫైనల్ ఔట్ పుట్ ఏంటి? మీటింగ్ తర్వాత అంతా సర్ధుకునేనా? ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య గ్యాప్ సంగతేంటి?
కాంగ్రెస్ ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్ వేడి ఇంకా తగ్గట్లేదు. ఓ మంత్రి టార్గెట్‌గా పది మంది ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమయ్యారన్న ప్రచారం..కాంగ్రెస్ పార్టీని కుదిపేసింది. అలర్ట్ అయి నాలుగు రోజుల కింద ఎమ్మెల్యేలతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు వినకపోవడంతో..దీపాదాస్ మున్షి వచ్చాక ప్రత్యేక మీటింగ్ నిర్వహిస్తామన్నారు.
ఎమ్మెల్యేలతో స్పెషల్ భేటీ కాస్త హాట్ టాపిక్ అయింది. శాసనసభ్యుల రహస్య సమావేశం కాంగ్రెస్ పార్టీని షేక్ చేస్తుందన్న ప్రచారం జరిగింది. దీంతో ఇది ఎటో దారి తీస్తుందని భావించిన కాంగ్రెస్ పార్టీ..ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశాన్ని కాస్త సీఎల్పీ మీటింగ్‌గా మార్చేసింది. అలా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులతో మీటింగ్ నిర్వహించారు. సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో చాలా అంశాలపై డిస్కస్ చేశారు.
Also Read : ఈసారైనా క్యాబినెట్ విస్తరణ జరిగేనా? మంత్రి పదవి దక్కే ఆ ఆరుగురు అదృష్టవంతులు ఎవరు?
ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాలేదని..అర్థం చేసుకోవాలని విన్నపం..!
సీఎల్పీ మీటింగ్‌లో ఎమ్మెల్యేలు తమ ఇబ్బందులను వివరించినట్లు తెలుస్తోంది. తమ నియోజకవర్గాలకు నిధులు ఇవ్వట్లేదని..ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయని వాపోయారట. అయితే బీఆర్ఎస్ హయాంలో కేటాయించిన దాని కంటే..కాంగ్రెస్ సర్కార్ పాలనలోనే నియోజకవర్గాలకు ఎక్కువ నిధులు ఇచ్చామని చెప్పారట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన ఆయన.. ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాలేదని..అర్థం చేసుకోవాలని ఎమ్మెల్యేలను కోరారట.
రహస్య మీటింగ్‌లు, ప్రత్యేక సమావేశాలు పెట్టుకుని మీడియాకు ఎక్కొద్దు..
ఇక ఎమ్మెల్యేలతో సీక్రెట్ మీటింగ్ నిర్వహించిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సీఎల్పీ భేటీలో తన వాయిస్ వినిపించారట. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీద ఆయన ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. భూముల ఆక్రమణ మీద ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని..ఇలా అయితే ఎలా అని ప్రశ్నించారట అనిరుధ్‌రెడ్డి.
ఆయనే కాదు పలువురు ఎమ్మెల్యేలు కూడా.. మంత్రులు టైమ్ ఇవ్వడం లేదని పార్టీ, ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లారట. అయితే ప్రతీ రెండు నెలలకోసారి సీఎల్పీ సమావేశం ఉంటుందని ..ఎమ్మెల్యేలకు సమస్యలు ఉంటే ఆ భేటీలోనే చెప్పుకోవాలని సూచించారట పార్టీ పెద్దలు. రహస్య మీటింగ్‌లు, ప్రత్యేక సమావేశాలు పెట్టుకుని మీడియాకు ఎక్కొద్దని కోరారట.
ఇక బీసీ సభలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై పలువురు నేతలు ప్రస్తావించారట. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారట. అయితే క్రమశిక్షణ కమిటీ అన్నీ పరిశీలిస్తుందని..కచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని పార్టీ పెద్దలు హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు నేతలు. ఇక పార్టీ పరంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఇచ్చే 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ అమలు వంటి అంశాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని డిసైడ్ అయిందట కాంగ్రెస్ పార్టీ.
Also Read : మాజీమంత్రి విడదల రజిని మెడకు మరో ఉచ్చు..! ఇలాంటి కేసు వస్తుందని అస్సలు ఊహించలేదట..!
సీఎల్పీ భేటీలోనూ ఈ రెండు అంశాలపై చర్చించారట. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై కావాల్సిన మైలేజ్ పొందాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ..అందుకోసం ఎమ్మెల్యేలు గ్రౌండ్ లెవల్‌లో చర్చ పెట్టాలని సూచించారట. అంతేకాదు పార్టీపరంగా ఇస్తున్న బీసీ రిజర్వేషన్లపై సూర్యాపేట వేదికగా సభ నిర్వహించి సత్తా చాటాలని నిర్ణయించారట. ఇక ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని చెప్పేందుకు గజ్వేల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారట.
సమస్యలతో పాటు..మంత్రులు టైమ్ ఇవ్వడం లేదన్న అంశాలపై చర్చిస్తారని అనుకున్న ఎమ్మెల్యేలకు కొంత నిరాశే ఎదురైందట. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేదని చెప్పి.. అన్నింటికీ అదే పరిష్కారం అన్నట్లుగా చేతులు దులుపుకున్నారట. దీంతో అటు నిధులపై.. ఇటు మంత్రుల అపాయింట్‌మెంట్‌పై..ఏమీ తేల్చక..మీటింగ్ మమ అనిపించారని గుసగుసలు పెట్టుకున్నారట పలువురు ఎమ్మెల్యేలు. ఈ మీటింగ్ తర్వాత ఎమ్మెల్యేలు చల్లబడినట్లేనా? లేక అసంతృప్తులు కంటిన్యూ అవుతూనే ఉంటాయా? అనేది వేచి చూడాలి.