బీఆర్ఎస్‌లో ఫైర్‌బ్రాండ్ లీడర్లకు ఏమైంది.. ఆ భయంతోనే మౌనంగా ఉంటున్నారా?
అధికారంలో ఉండగా, స్పీడ్ చూపించిన నేతలు... పార్టీ కష్ట కాలంలో ఉండగా అదే స్పీడ్‌తో క్యాడర్ లో ఉత్సాహం నింపాల్సిందిపోయి.. వారే నిరుత్సాహంతో మూలన చేరిపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Gossip Garage : బీఆర్ఎస్‌లో ఫైర్‌బ్రాండ్ లీడర్లకు ఏమైంది? అధికారంలో ఉండగా హల్‌చల్ చేసిన నేతలు… ప్రతిపక్ష పాత్రలో ఇమడలేకపోతున్నారా? గెలిచిన ఎమ్మెల్యేలు గోడ దూకేస్తుంటే… తామెందుకు గొంతు చించుకోవడం అనుకుంటున్నారా ఓడిన నేతలు? గత ప్రభుత్వాన్ని కాంగ్రెస్ సర్కార్ టార్గెట్ చేసే సమయంలో తామెక్కడ బలైపోతామని భయపడుతున్నారా? అధికార పార్టీ ఒక్కొక్కరినీ టార్గెట్ చేస్తూ… బీఆర్ఎస్ పై ఉక్కుపాదం మోపుతున్నా… ఫైర్ బ్రాండ్ నేతలెవరూ ఎందుకు ప్రతిఘటించ లేకపోతున్నారు..?
సైలెంట్ మోడ్ లోకి ఫైర్ బ్రాండ్ నేతలు..
దాదాపు రెండు దశాబ్దాలుగా తెలంగాణ రాజకీయాలను ఒంటి చేత్తో శాసించిన గులాబీదళం… ఇప్పుడు గందరగోళాన్ని గట్టెక్కేందుకు నానా పాట్లు పడుతోంది. పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు విపక్షంపై ఒంటికాలితో లేచిన ఫైర్ బ్రాండ్ నేతలు… ఇప్పుడు సైలెంట్ మోడ్ లోకి వెళ్లడంపై పార్టీలో విస్తృత చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఉద్యమ కాలంలో పోరాట యోధులుగా గుర్తింపు తెచ్చుకున్న నేతలు కూడా వెనకబెంచీకి పరిమితమైపోవడం అనేక సందేహాలకు కారణమవుతోంది.
పార్టీ ఓటమితో అంతా సైలెంట్..
అసెంబ్లీ ఎన్నికలు ముగిసి దాదాపు 8 నెలలు కావస్తున్నా.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఓటమి నుంచి బయటకు రాలేకపోతున్నారా? అనే చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ లో అధినేత కేసీఆర్ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, గాదరి కిశోర్, రసమయి బాలకిషన్, ఆశన్నగారి జీవన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ వంటి వారు మంచి మాటకారులుగా గుర్తింపు పొందారు. అధికారంలో ఉండగా, అంతా పవర్ ఫుల్ పంచ్ డైలాగ్‌లతో హంగామా చేసే వారు. ఐతే పార్టీ ఓటమి తర్వాత కేటీఆర్, హరీశ్‌రావు తప్ప మిగతా వారు ఎవరూ ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు. కనీసం వినిపించడం లేదన్న టాక్ నడుస్తోంది.
కీలక పదవులు అనుభవించిన నేతలంతా ఇప్పుడు మౌనముద్రలో..
ఏకంగా గులాబీ బాస్ కేసీఆర్ సైతం సైలెంట్ అయిపోగా… ఆయన మౌనం వెనుక ఏదో మర్మం ఉందంటూ గులాబీ నేతలు లెక్కలేసుకుంటున్నారు. ఇక ఆయన తప్పితే సర్కార్ పై సమరం చేసేందుకు కేటీఆర్, హరీశ్ మాత్రమే ముందుంటున్నారు. అడపాదడపా కౌశిక్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి వంటి కొద్దిమంది నేతలు ముందుకొస్తున్నా.. గతంలో కీలక పదవులు అనుభవించిన నేతలంతా ఇప్పుడు మౌనముద్ర మెయింటైన్ చేస్తుండటం కార్యకర్తలను నైరాశ్యంలో పడేస్తోందంటున్నారు.
రేవంత్ సీఎం అయ్యాక ఆ ఇద్దరు గప్ చుప్..
మాజీ మంత్రులు మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు టీడీపీ నుంచి బీఆర్ఎస్‌లో చేరినా.. మంత్రి పదవులిచ్చి గౌరవించింది పార్టీ. ఈ ఇద్దరికీ సీఎం రేవంత్‌రెడ్డితో టీడీపీలో ఉన్నప్పటి నుంచే విభేదాలు ఉండేవి. దీంతో రేవంత్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తీవ్ర విమర్శలతో రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు. ఐతే ఎన్నికల్లో గెలిచి రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక… ఈ ఇద్దరూ పల్లెత్తి మాట్లాడటం లేదు. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలల్లో ఆక్రమణలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో ఆయన గప్‌చుప్ అయిపోయారంటున్నారు. ఇక ఎర్రబెల్లి మాత్రం తన రాజకీయ జీవితంలో ఎదురైన తొలి ఓటమి నుంచి ఇంకా తేరుకోనట్లే కనిపిస్తున్నారు. సీనియర్ నేతగా ఇతరులను ముందుండి నడిపించాల్సిన ఎర్రబెల్లి పూర్తిగా తన నియోజకవర్గ రాజకీయాలకే పరిమితమైపోవడమే చర్చకు తావిస్తోంది.
కేసీఆర్ వెన్నంటి నడిచిన వారు.. పోరాట పంథా నుంచి తప్పుకున్నారా..?
ఇక పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అన్నింటికీ ముందున్న మాజీ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, గాదరి కిశోర్, బాల్క సుమన్, రసమయి, శంకర్ నాయక్, గువ్వల బాలరాజు.. ఇప్పుడు మాట్లాడాలంటేనే భయపడిపోతున్నట్లు చెబుతున్నారు. ఆర్మూరులో ఆర్టీసీ స్థలాన్ని లీజుకు తీసుకున్న జీవన్‌రెడ్డి… లీజు మొత్తం చెల్లించకపోవడంతో ప్రభుత్వం నోటీసులిచ్చింది. ఆ సమయంలో కొంత హడావుడి చేసిన జీవన్‌రెడ్డి… పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత పెద్దగా కనిపించడమే మానేశారు. ఇక ఉద్యమకాలం నుంచి కేసీఆర్ వెన్నంటే నడిచిన గాదరి కిశోర్, గువ్వల బాలరాజు, కర్నె ప్రభాకర్, బాల్క సుమన్…. ఇప్పుడు పోరాట పంథా నుంచి తప్పుకున్నట్లు కనిపిస్తున్నారంటున్నారు.
ఓటమి తర్వాత రాష్ట్ర రాజకీయాలకు సంబంధం లేదన్నట్లే వ్యవహరం..
కర్నె ప్రభాకర్, బాల్క సుమన్, గువ్వల బాలరాజు, గాదరి కిశోర్ ఎక్కడా ఆచూకీ లేకుండా తప్పించుకు తిరుగుతున్నారని బీఆర్ఎస్ శ్రేణులు విమర్శిస్తున్నాయి. చివరకు నిరుద్యోగుల ఆందోళనల్లాంటి సమయంలో సైతం ప్రభుత్వాన్ని నిలదీయకుండా టీవీ డిబేట్లకు సైతం ముఖం చాటేశారనే టాక్ నడుస్తోంది. ఉమ్మడి నల్లొండ జిల్లాలో గాదరి కిశోర్… పాలమూరులో గువ్వల బాలరాజు ఓ రేంజ్ లో రాజకీయం చేశారు. పదేళ్లపాటు తాము చెప్పిందే వేదం అన్నట్లు పాలన సాగించారు. ఇప్పుడు చేతిలో అధికారం లేకపోవడంతో తమకు రాష్ట్ర రాజకీయాలకు సంబంధం లేదన్నట్లే వ్యవహరిస్తున్నారని… కేవలం తమ సొంత నియోజకవర్గ వ్యవహారాలకే పరిమితమవుతున్నారని చెబుతున్నారు.
తమ పనులను చక్క బెట్టుకుంటున్నారనే గుసగుసలు..
ఇక కళాకారుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రసమయి బాలకిషన్ కూడా రాష్ట్ర స్థాయిలో ప్రభావం చూపగల నేతే అయినప్పటికీ…. కేవలం తన సొంత నియోజకవర్గానికే పరిమితమైపోయారంటున్నారు. అధికారంలో ఉండగా, స్పీడ్ చూపించిన నేతలు… పార్టీ కష్ట కాలంలో ఉండగా అదే స్పీడ్‌తో క్యాడర్ లో ఉత్సాహం నింపాల్సిందిపోయి.. వారే నిరుత్సాహంతో మూలన చేరిపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక మరికొంత మందైతే తెరచాటుగా కాంగ్రెస్ నేతలతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తూ.. తమ పనులను చక్క బెట్టుకుంటున్నారనే గుసగుసలు విన్పిస్తున్నాయి.
Also Read : కాంగ్రెస్‌లో చేరబోయే 11వ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇతడే?