Yennam Vs Sanjeev: మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే వర్సెస్ డీసీసీ ప్రెసిడెంట్.. ఉప్పు, నిప్పులా యెన్నం శ్రీనివాస్, సంజీవ్ ముదిరాజ్.. ఎందుకు..
Yennam Vs Sanjeev: పాలమూరు జిల్లా కేంద్రమైన మహబూబ్ నగర్లో రెండు గ్రూపులు ఉత్తరం-దక్షిణంలా మారాయి. మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్‌ల మధ్య పోరు ఉప్పు-నిప్పులా మారిందట. ఒకరి ముఖం మరొకరు చూసుకునే పరిస్థితి లేకుండా పోయిందట. ఒకరిపై మరొకరు నిత్యం ఫిర్యాదులతో రాష్ట్ర నాయకత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారట. ఇద్దరు నేతలు మొదట్లో చాలా సఖ్యతగా ఉండేవారట. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్‌ను..జిల్లా అధ్యక్షుడిగా ప్రతిపాదించి ఫుల్ సపోర్ట్ చేసింది ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డేనట.
చిన్న చిన్న ఇష్యూస్‌తో మొదలైన గ్యాప్..
మొదట్లో అంతా బాగానే ఉన్నా..చిన్న చిన్న ఇష్యూస్‌తో మొదలైన గ్యాప్..మున్సిపల్ ఎన్నికలు..ఆ తర్వాత నెలకొన్న పరిణామాలతో ఇద్దరి మధ్య పూడ్చలేని అగాదంగా తయారైందట. మున్సిపల్ ఎన్నికల్లో ఎమ్మెల్యే యెన్నం సూచించిన వారికి కాకుండా ఇతరులకు బీ-ఫామ్‌లు ఇచ్చారట. కొందరికి కావాలనే డబుల్ బీ-ఫామ్‌లు ఇచ్చి..తమను ఇబ్బంది పెట్టారనేది యెన్నం అనుచరుల వాదన. అంతేకాదు డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్..ప్రభుత్వ సలహాదారుడు జితేందర్ రెడ్డి, మైనారిటీ కార్పొరేషన్ ఛైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ గౌడ్ జట్టు కట్టి..ఎమ్మెల్యేను ఇరకాటంలో పడేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎంపికలో కూడా ఎమ్మెల్యేను ట్రబుల్స్‌లో పెట్టారని చెబుతున్నారు. మరోవైపు..ఎమ్మెల్యే యెన్నం వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీని పణంగా పెడుతున్నారని డీసీసీ వర్గం ఆరోపిస్తోంది.
వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని యెన్నం డిమాండ్..
పురపోరు నుంచి చిన్నగా మొదలైన వైరం కాస్త ముదురుతోందట. ఎమ్మెల్యే యెన్నం ఇప్పుడు ప్రభుత్వ విప్ కావడంతో..మహబూబ్‌నగర్ నియోజకవర్గంపై మరింత పట్టు పెంచుకోవాలని చూస్తున్నారట. తన వ్యతరేకులకు చెక్ పెట్టకపోతే తనను మరిన్ని ఇబ్బందులు పెట్టే ప్రమాదం ఉందని భావిస్తున్నారట. అందుకే మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపుతో పాటు..ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎంపికలో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలపై..పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు ఫిర్యాదు చేశారట. కార్పొరేటర్లతో ఏర్పాటు చేసిన క్యాంపులో మున్సిపల్ మాజీ ఛైర్మన్ ఆనంద్ గౌడ్ తో పెద్దఎత్తున డబ్బులు పంచి..తనకు వ్యతిరేకంగా పెద్ద కుట్ర చేశారని కంప్లైంట్లో వివరించారట ఎమ్మెల్యే యెన్నం. డీసీసీ సంజీవ్ ముదిరాజ్ తప్పులు చేశారంటూ స్వయంగా పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లారట. డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్తో పాటు ఆనంద్ గౌడ్, జితేందర్ రెడ్డి, ఓబేదుల్లా కొత్వాల్పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
కంప్లైంట్లతో పాలమూరు కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ వార్ తార స్థాయికి చేరిందట. ఒకరిపై మరొకరు ఫిర్యాదులతో పాటు యాక్షన్ తీసుకోవాల్సిందేనని పట్టుబడుతున్నారట. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో.. పార్టీ అగ్రనాయకత్వం కూడా రెండు వర్గాలలో ఎవరికి నచ్చజెప్పాలో అర్థంకాక సతమతమవుతోందట. పాలమూరు హస్తంలో కుస్తీ ఎటువైపునకు దారి తీస్తుందో చూడాలి.
Also Read: అటు జీవన్ రెడ్డి.. ఇటు కవిత.. రివేంజ్ గేమ్‌లో పైచేయి ఎవరిది?
