TSPSC Group 1 Prelims : ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, పరీక్షలు నిర్వహించేది ఇలానేనా? TSPSCపై హై‌కోర్టు సీరియస్

TSPSC Group 1 Prelims

TSPSC Group 1 Prelims : ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, పరీక్షలు నిర్వహించేది ఇలానేనా? TSPSCపై హై‌కోర్టు సీరియస్

TSPSC Group 1 Prelims - High Court (Photo : Google)

TSPSC Group 1 Prelims – High Court : గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. రేపటికి (సెప్టెంబర్ 27) వాయిదా వేస్తూ తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ టీఎస్ పీఎస్ సీ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. TSPSC తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రూల్స్ మీరే ఉల్లంఘిస్తే ఎలా అని ప్రశ్నించింది హైకోర్టు. ఉద్యోగాలు రాక చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, పరీక్షల నిర్వహణలో టీఎస్ పీఎస్ సీ ఎందుకు విఫలం అవుతోందని ప్రశ్నించింది.

Also Read: చంద్రబాబు అరెస్టుపై స్పందించిన కేటీఆర్.. మాకేం సంబంధం.. హైదరాబాద్ లో ర్యాలీలు ఎందుకు?

మొదటిసారి పేపర్ లీకేజీతో పరీక్ష రద్దైంది, రెండోసారి నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యం వహించారు అని న్యాయస్థానం మండిపడింది. గ్రూప్ -1 ప్రిలిమ్స్ లో బయోమెట్రిక్ పెట్టకపోవడానికి కారణాలు ఏంటో చెప్పాలని ప్రశ్నించింది. అయితే, సాంకేతిక కారణాలతోనే బయోమెట్రిక్ పెట్టలేదని టీఎస్ పీఎస్ సీ తెలిపింది. ఉద్దేశపూర్వకంగా కాదని, దీని వల్ల విద్యార్థులకు ఎలాంటి నష్టం లేదని కోర్టుకి వివరించింది టీఎస్‌పీఎస్‌సీ.

Also Read: ఎమ్మెల్యే గొంగిడి సునీతపై హైకోర్టు ఆగ్రహం, భారీ జరిమానా

ఈ కారణంగా పరీక్ష మొత్తం రద్దు చేయడం సరికాదని వెల్లడించింది టీఎస్ పీఎస్ సీ. 2లక్షల మంది విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉందని వాపోయింది. పరీక్షకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చిన హైకోర్టు.. విచారణ రేపటికి వాయిదా వేసింది.