ఆ ప్రాంతంలో కాంగ్రెస్‌లో గ్రూప్ పాలిటిక్స్.. ముగ్గురు నేతల మధ్య ఆధిపత్య పోరు
ఇలాగే కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తీవ్రంగా నష్టపోవడం ఖాయమని క్యాడర్ అసంతృప్తిలో ఉందట.

Congress: జహీరాబాద్ సెగ్మెంట్ రాష్ట్రంలోనే కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న నియోజకవర్గాలలో ఒకటి. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి అత్యంత సన్నిహితుడిగా ఉన్న బాగారెడ్డి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని తిరుగులేని శక్తిగా మలిచారు. ఆ తర్వాత గీతారెడ్డి ఆ పరంపరను కొనసాగిస్తూ వచ్చారు.
అయితే గత కొంత కాలంగా గీతారెడ్డి వయోభారంతో నియోజకవర్గ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. గత ఎన్నికల్లో ఆమె పోటీకి దూరంగా ఉండిపోవడంతో వికారాబాద్‌కు చెందిన మాజీ మంత్రి చంద్రశేఖ పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్ రావు చేతిలో ఓడిపోయారు. తన ఓటమికి సెట్విన్ ఛైర్మన్ గిరిధర్‌రెడ్డితో పాటు మరో నేత ఉజ్వల్ రెడ్డే కారణమని నియోజకవర్గ ఇంచార్జ్ చంద్రశేఖర్ ఆరోపణలు గుప్పించడంతో గ్రూపు రాజకీయాలకు తెరలేచినట్లైంది. (Congress)
సెట్విన్ ఛైర్మన్ గిరిధర్ రెడ్డి, మరో నాయకుడు ఉజ్వల్‌రెడ్డి, చంద్రశేఖర్ ముగ్గురు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారట. ఇటీవల జహీరాబాద్ మండల అధ్యక్షుడు నర్సింహారెడ్డిని చంద్రశేఖర్ సస్పెండ్ చేశాడు. అయితే ఆ సస్పెన్షన్ చెల్లదంటూ జిల్లా అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి వెంటనే ప్రకటించడం సంచలనం రేపింది.
తను ముఖ్యకార్యకర్తల సమావేశం పెడితే కార్యకర్తల్ని నర్సింహారెడ్డి రాకుండా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడని, అందుకే సస్పెండ్ చేయాల్సి వచ్చిందని చంద్రశేఖర్ చెప్తున్నారు. నర్సింహారెడ్డి పార్టీ సీనియర్ నాయకుడు గిరిధర్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్నాడు. ఈ పరిణామాలతో గ్రూపు రాజకీయాలు మరోసారి భగ్గుమన్నాయి.
క్యాడర్‌లో అసంతృప్తి
గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచే సీటుగా ఉన్న జహీరాబాద్‌లో చంద్రశేఖర్ ఓడిపోవడానికి ఆయన వ్యవహారశైలే ప్రధాన కారణమని గిరిధర్ రెడ్డి, ఉజ్వల్ రెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు. అయినా చంద్రశేఖర్ వ్యవహార శైలిలో ఏమాత్రం మార్పు రాలేదన్నది వారి వాదన. ఇలా మూడు గ్రూపులుగా విడిపోయి పార్టీ ప్రతిష్టను మరింత దిగజార్చుతున్నారని కార్యకర్తలు వాపోతున్నారు.
ఇలాగే కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తీవ్రంగా నష్టపోవడం ఖాయమని క్యాడర్ అసంతృప్తిలో ఉందట. ఈ మూడు ముక్కలాటలో పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు నలిగిపోతున్నారు. జిల్లా ఇంచార్జ్ మంత్రి వివేక్, జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టికి ఈ గ్రూపు రాజకీయాల వ్యవహారం వెళ్లినట్లు తెలుస్తోంది. మరి మూడు గ్రూపుల్ని ఒకే తాటిపై నడిపిస్తారా..? లేక ఇలాగే వదిలేస్తారా అన్నది వేచి చూడాలి.