జీరో కామెంట్స్ మీద బిగ్ ట్విస్ట్ ఇచ్చిన నారాయణ.. చంద్రబాబు దూకమంటే దూకుతా అంటూ వర్మ స్టేట్‌మెంట్‌.. ఏం జరుగుతోంది?

పిఠాపురంలో వర్మను జీరో చేశామని నారాయణ చెప్పినట్లుగా ఓ ఆడియో సర్క్యులేట్ అయింది. ఇదే వివాదానికి దారి తీసింది.

జీరో కామెంట్స్ మీద బిగ్ ట్విస్ట్ ఇచ్చిన నారాయణ.. చంద్రబాబు దూకమంటే దూకుతా అంటూ వర్మ స్టేట్‌మెంట్‌.. ఏం జరుగుతోంది?

Updated On : October 18, 2025 / 10:06 PM IST

Pithapuram: పిఠాపురం నియోజకవర్గం. పవన్‌ కల్యాణ్ పోటీ, గెలుపుతో పిఠాపురం ట్రెండింగ్‌ అయిపోయింది. అయితే పవన్‌ కల్యాణ్‌ ఎంట్రీతో పిఠాపురం టీడీపీ టికెట్ త్యాగం చేసిన SVSN వర్మకు కూడా అదే స్థాయిలో హైప్ వచ్చింది. త్యాగం చేసిన నేతగా ఆయన ఏపీ పాలిటిక్స్‌లో లైమ్‌లైట్‌లో ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో వర్మకు నామినేటెడ్‌ పదవి అంటూ..ఎమ్మెల్సీ ఇస్తారంటూ ప్రచారం నడుస్తూనే ఉంది. కానీ ఆయనకు ఇప్పటివరకు ఏ పదవి దక్కలేదు.

దీంతో కొన్నాళ్లుగా వర్మ అసంతృప్తిగా ఉన్నట్లు.. ఆ మధ్య ట్వీట్‌ కూడా చేశారని కొంత చర్చ నడిచింది. ఇప్పుడు మరోసారి వర్మ న్యూస్‌ హెడ్‌లైన్‌గా మారారు. అయితే ఇందులో ఆయన ఇన్వాల్వ్‌మెంట్‌ ఏం లేదు. బీజేపీ, జనసేన లీడర్లతో టీడీపీ నేతల గ్యాప్‌ను సెట్‌ చేసేందుకు.. మంత్రి నారాయణ ఓ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

అందులో పిఠాపురం వర్మ ప్రస్తావన తెచ్చారు. పిఠాపురంలో వివాదాలు లేకుండా చేశామని.. వర్మ సైలెంట్ అయ్యారని నారాయణ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో పిఠాపురంలో వర్మను జీరో చేశామని నారాయణ చెప్పినట్లుగా ఓ ఆడియో సర్క్యులేట్ అయింది. ఇదే వివాదానికి దారి తీసింది.

Also Read: బంద్‌కు మద్దతు సరే.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై వాట్‌నెక్స్ట్‌? క్యాబినెట్ భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు?

మంత్రి నారాయణ మాట్లాడిన ఆడియో..పిఠాపురం పాలిటిక్స్‌ను తెరమీదకు తెచ్చింది. అసలే అసంతృప్తిలో ఉన్న వర్మ..వర్మ మీద అగ్గి మీద గుగ్గిలంగా ఉన్న జనసేన క్యాడర్‌..మంత్రి ఆడియోను అడ్వాంటేజ్‌గా మల్చుకునే ప్రయత్నం చేసింది. మాతో పెట్టుకుంటే అట్టాగే ఉంటుంది అని నారాయణ ఆడియోను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేశారు జనసేన కార్యకర్తలు.

ఎంతటి త్యాగమైనా చేస్తా: వర్మ

దీని మీద పిఠాపురం వర్మ కూడా రియాక్ట్ అయ్యారు. తాను టీడీపీకి క్రమశిక్షణ కలిగిన నాయకుడిని చంద్రబాబుకు నమ్మకమైన నేతను అన్నారు. పార్టీ కోసం తాను ఎంతటి త్యాగమైనా చేస్తానని ప్రకటించారు. కట్ చేస్తే విశాఖలో పర్యటిస్తున్న మంత్రి నారాయణను పిఠాపురం వర్మ కలవడం రాజకీయంగా చర్చకుదారితీసింది. వైరల్ అయిన మంత్రి గారి ఆడియోపై మీడియా ప్రశ్నించగా..నారాయణ బిగ్‌ ట్విస్ట్‌ ఇచ్చారు. వర్మను జీరో అనలేదని పిఠాపురంలో వివాదాలు జీరో అని మాత్రమే అన్నాను అని చెప్పుకొచ్చారు మినిస్టర్ నారాయణ.

పిఠాపురంలో ఇక నుంచి ఏ రకమైన వివాదాలు ఉండవని తాను చెబితే దానిని మీడియా వక్రీకరించి ప్రచారం చేసిందని మంత్రి అన్నారు. అయితే వర్మ మాత్రం తాను అసత్య ప్రచారాలను పట్టించుకోనని చెప్పి..వివాదానికి ఫుల్‌ స్టాప్‌ పెట్టే ప్రయత్నం చేశారు. దీంతో మరోసారి పిఠాపురం పాలిటిక్స్‌ హాట్ టాపిక్ అయ్యాయి.