బంద్‌కు మద్దతు సరే.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై వాట్‌నెక్స్ట్‌? క్యాబినెట్ భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు?

ఇప్పటికే అసెంబ్లీలో బిల్ పాస్ చేసి రాష్ట్రపతికి పంపింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ బిల్లు ఇంకా పెండింగ్‌లోనే ఉంది.

బంద్‌కు మద్దతు సరే.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై వాట్‌నెక్స్ట్‌? క్యాబినెట్ భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు?

Updated On : October 18, 2025 / 8:33 PM IST

BC reservation: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంపై సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకోబోతుందా? అంటే అవుననే సమాధానం వస్తుంది. ఒకవైపు ప్రభుత్వం ఇచ్చిన జీఓ 9 పై హైకోర్టు స్టే విధించడంతో సుప్రీంకోర్టుకెళ్లింది రేవంత్ సర్కార్. ప్రభుత్వం వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది.

ఏ ప్రాతిపదికన రిజర్వేషన్లు డిసైడ్ చేశారని ప్రశ్నించడంతో పాటు పాత రిజర్వేషన్ల ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అంటూ సూచించింది సుప్రీంకోర్టు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల అంశంపై న్యాయనిపుణులతో చర్చిస్తోంది. 23న జరిగే క్యాబినెట్ భేటీలో డిస్కస్ చేసి ముందుకెళ్లాలని భావిస్తున్నారట. (BC reservation)

బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం పాస్‌ చేసిన బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్‌లో ఉంది. ఆ బిల్లుకు ఆమోదం తెలిపేలా కేంద్రంపై మరోసారి ఒత్తిడి తెచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోందట రాష్ట్ర ప్రభుత్వం. హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులు స్టేట్‌ సర్కార్‌కు అనుకూలంగా లేకపోవడంతో కేంద్రంపై ఏ విధమైన ఒత్తిడి తేవాలని అంశంపై త్వరలో ఒక నిర్ణయం తీసుకోబోతుంది రేవంత్ రెడ్డి సర్కార్. ఈ నెల 23న జరిగే క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనుంది సర్కార్.

Also Read: గుండెలను పిండేస్తున్న వీడియో.. 38 ఏళ్లు స్కూల్‌లో పనిచేసిన ప్యూన్‌.. ఇప్పుడు చివరిసారి బెల్‌ కొట్టి గుడ్‌ బై..

జాతీయస్థాయిలో అన్ని పార్టీల మద్దతు కూడగట్టి పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తోందట ప్రభుత్వం. బీసీ సంఘాలు నిర్వహించిన బంద్‌కు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినట్లే..కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు అన్ని పార్టీల సపోర్ట్‌, బీసీ, ప్రజా సంఘాల మద్దతు తీసుకోవాలని అనుకుంటోందట కాంగ్రెస్ సర్కార్. పలు రాష్ట్రాల్లో కూడా బీసీ రిజర్వేషన్ల ఇష్యూ నడుస్తుండటంతో..వాళ్లందరిని కలుపుకుపోయి..రాష్ట్రపతి ఆమోదం పొందేలా ఒత్తిడి తేచ్చే ప్లాన్ చేస్తోందట.

దశలవారీగా అమలు?

ఒక కార్యాచరణను రూపొందించి దశలవారీగా అమలు చేయాలని సర్కార్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దేశ రాజధానిలో మరో ఆందోళన కార్యక్రమం చేసే యోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉందట. రాజ్యాంగంలోని షెడ్యూల్ 9 కింద ఈ అంశాన్ని చేర్చాలని..పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కేంద్రం ముందు డిమాండ్ పెట్టాలని వ్యూహం రచిస్తోందట. హైకోర్టు తుది తీర్పు తర్వాత మరోసారి సుప్రీంకోర్టుకెళ్లే అంశాన్ని కూడా పరిశీలిస్తోందట రేవంత్ రెడ్డి సర్కార్.

ఇప్పటికే అసెంబ్లీలో బిల్ పాస్ చేసి రాష్ట్రపతికి పంపింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ బిల్లు ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఇక ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం తెలపలేదు. గతంలోనే ఢిల్లీలో ఆందోళన చేసి ఆఖరి అస్త్రంగా వాడేసింది. తర్వాత రిజర్వేషన్ల ఫైల్ కోర్టుమెట్లెక్కింది. అది అయ్యే పని కాదని న్యాయస్థానాలు తేల్చి చెప్పాయి.

ఇక ఇప్పుడు బీసీ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన బంద్‌కు కూడా పూర్తి మద్దతు ఇచ్చింది కాంగ్రెస్. ఇక రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో పెడితే తప్ప బీసీ రిజర్వేషన్లకు రూట్ క్లియర్ కాదు. అందుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ ఒప్పుకుంటుందా అంటే ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నగా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లు పంచాయితీ తెగదు..స్థానిక ఎన్నికలకు ముందడుగు పడదు అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఈ నెల 23న జరిగే క్యాబినెట్‌ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి మరి.