నిన్న ఈడీ సోదాలు.. ఇవాళ ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సోదరుడి ఇంటికి హరీశ్ రావు.. కీలక వ్యాఖ్యలు

Harish Rao: మహిపాల్ రెడ్డి ఇంట్లో ఎలాంటి అవినీతి ఆస్తులు దొరకలేదని హరీశ్ రావు తెలిపారు.

నిన్న ఈడీ సోదాలు.. ఇవాళ ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సోదరుడి ఇంటికి హరీశ్ రావు.. కీలక వ్యాఖ్యలు

Harish Rao

తెలంగాణలోని పటాన్‌చెరు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత మహిపాల్ రెడ్డి ఇంట్లో గురువారం ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. మహిపాల్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి ఇంట్లోనూ సోదాలు చేశారు.

దీంతో ఇవాళ మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇంటికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు వెళ్లారు. ఈడీ తనిఖీల వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అనంతరం హరీశ్ రావు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఈడీ, ఐటీ దాడులతో వేధిస్తున్నాయని చెప్పారు.

మహిపాల్ రెడ్డి ఇంట్లో ఎలాంటి అవినీతి ఆస్తులు దొరకలేదని హరీశ్ రావు తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను భయపెట్టి లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బిహార్, గుజరాత్‌లో నీట్ ప్రశ్నపత్రాలను అమ్ముకున్నారని చెప్పారు. ప్రశ్నపత్రాలు లీకవుతున్నా అధికారులు ఎందుకు వారిపై దాడులు చేయటం లేదని అడిగారు.

నీట్ రాసిన వారి భవిష్యత్తు అయోమయంలో ఉందని తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ సర్కారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒత్తిడికి గురిచేస్తుందని చెప్పారు. మహిపాల్ రెడ్డి చాలా ధైర్యంగా ఉన్నారని, ఆయన ఏ తప్పూ చేయలేదని తెలిపారు. ఈడీకి ఎలాంటి ఆస్తులూ దొరకలేదని అన్నారు.

Also Read: ఎమ్మెల్యే భార్య రూపాదేవి ఆత్మహత్యకు కారణమదే.. కీలక విషయాలు వెల్లడించిన పోలీసులు