కరోనా..95 శాతం మందికి ఏ సమస్య లేదు..భయంతో చనిపోతున్నారు – ఈటెల

  • Published By: madhu ,Published On : July 24, 2020 / 11:01 AM IST
కరోనా..95 శాతం మందికి ఏ సమస్య లేదు..భయంతో చనిపోతున్నారు – ఈటెల

Updated On : July 24, 2020 / 11:22 AM IST

తెలంగాణలో 95 శాతం మంది కరోనా బాధితులకు ఎలాంటి సమస్య ఉండదని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టంచేశారు. తీవ్రమైన వైరస్‌ లక్షణాలున్న మిగతా ఐదు శాతం మందిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన అధికారులను ఆదేశించారు. 99 శాతం మంది బాధితులకు వెంటిలేటర్‌, రెమిడిసివిర్‌ వంటి మందులు అవసరం లేదన్న ఆయన.. భయంతో చాలామంది చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మందులు సకాలంలో ఉపయోగించడం వల్ల ప్రాణాలు కాపాడుకోవచ్చని ఈటల సూచించారు. 24 గంటల పాటు తాను అందుబాటులో ఉంటానని, ప్రతి ఒక్క వైద్యాధికారి పూర్తి సామర్థ్యంతో పనిచేయాలని సూచించారు.

కరోనా కట్టడిపై మంత్రి ఈటల రాజేందర్ అన్ని జిల్లాల వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ అన్ని జిల్లాలకు వ్యాప్తి చెందుతోందని, ఈ క్రమంలో అధికారులంతా మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్‌కే పరిమితమైన కేసులు క్రమక్రమంగా జిల్లాలకూ వెళ్తున్నాయన్నారాయన.

అన్‌లాక్ వలన ప్రజలు రాకపోకలు పెరిగాయని, ఈ క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోని వారు మాత్రమే వైరస్ బారిన పడుతున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు. అయితే వైరస్ సోకుతున్న వారిలో సుమారు 85 శాతం మందికి ఎలాంటి లక్షణాలు లేకపోవడం వలన వైరస్ వ్యాప్తిని గుర్తించడం కాస్త ఇబ్బందికరంగా మారిందని మంత్రి చెప్పారు.

ప్రపంచ వ్యాప్తంగా రీసెర్చ్ చేస్తున్న వారితో చర్చలు జరుపుతున్నామన్ని.. ఎప్పటికప్పుడు అధునాతన ట్రీట్‌మెంట్‌ సమాచారం అందిస్తామని మంత్రి ఈటల తెలిపారు. రాష్ట్రంలో కరోనా మరణాలను తగ్గించే దిశగా పనిచేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. వైరస్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించి, దాని నివారణకు అన్ని చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు.

దీనిలో భాగంగా జిల్లా కేంద్రాల్లోనూ మరిన్ని ఐసొలేషన్ సెంటర్స్‌ను ఏర్పాటు చేయాలని మంత్రి కోరారు. వాటికి అవసరమైన శానిటేషన్, పేషెంట్ కేర్ ప్రోవైడర్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, నర్సింగ్ స్టాఫ్‌ను నియమించుకోవాలని ఆయన జిల్లా వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ప్రభుత్వాసుపత్రుల్లో అవసరమైన సౌకర్యాల జాబితాను తయారు చేసి తనకు పంపాలని, వెంటనే అవి సమకూర్చుతామని మంత్రి ఈటల హామీ ఇచ్చారు. అన్ని ఆసుపత్రులకు హైదరాబాద్ నుంచే ఆక్సిజన్ సిలిండర్లను పంపిస్తామన్నారు.

వైద్యసిబ్బంది క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకొని కరోనా కట్టడికి కృషి చేయాలన్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాల, డయాబెటిస్ రోగులను మరింత జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని మంత్రి అధికారులతో అన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడటం కోసం మరింత వేగంగా నిరంతరం శ్రమించాల్సి ఉందని ఆయన వెల్లడించారు.

అదేవిధంగా ఐసోలేషన్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులకు రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు మెరుగైన ఆహారం అందివ్వాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వైరస్ సోకుతున్న వారిలో సుమారు 85 శాతం మందికి ఎలాంటి లక్షణాలు ఉండండం లేదన్న ఆయన.. దీనివల్ల వైరస్ వ్యాప్తిని గుర్తించడం కాస్త ఇబ్బందికరంగా మారిందన్నారు.

వైద్యసిబ్బంది క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకొని కరోనా కట్టడికి కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా దీర్ఘకాలిక, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, డయాబెటిస్ రోగులను మరింత జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని మంత్రి అధికారులతో అన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడటం కోసం మరింత వేగంగా నిరంతరం శ్రమించాల్సి ఉందని సూచించారు.