MLC Kavitha: రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు.. ఎమ్మెల్సీ కవిత ట్విటర్ ద్వారా ఏం చెప్పారంటే?
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు సహాయసహకారాలు అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం అన్నిరకాలుగా అప్రమత్తంగా ఉందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు.

MLC Kavitha
MLC Kavitha Tweet: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు దంచికొడుతున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు చోట్ల రోడ్లపై భారీగా వర్షపు నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.
రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, మహబూబాబాద్, వరంగల్, వికారాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక 16 జిల్లాలకు అధికారులు అరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఉరుములు, మెరుపులతోపాటు గంటలకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు సహాయసహకారాలు అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం అన్నిరకాలుగా అప్రమత్తంగా ఉందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఈ మేరకు ఆమె తన ట్విటర్ ఖాతాద్వారా స్పందించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంలు ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉంటాయని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కంట్రోల్ రూం ద్వారా అధికారులను సంప్రదించగలరని కవిత చెప్పారు. కంట్రోల్ రూంతో పాటు, నా కార్యాలయం నిరంతరం అందుబాటులో ఉంటూ, వరద ప్రభావిత ప్రజలకు సహాయసహకారాలు అందిస్తుందని కవిత అన్నారు.
https://twitter.com/RaoKavitha/status/1684068389713776640
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి ప్రశాంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పర్యటించి వరద పరిస్థితులు, సహాయచర్యలను ఎప్పటకప్పుడు పర్యవేక్షిస్తూ భరోసానిస్తున్నారని, అధికారులు లోతట్టు ప్రాంతాలలో క్షేత్రస్థాయిలో పర్యటించి, ప్రజల కనీస అవసరాలకు ఎలాంటి లోటు రాకుండా ఏర్పాట్లు చేస్తున్నారని కవిత చెప్పారు.