Telangana Rains: ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఆరెంజ్, ఎల్లో అలర్ట్ లు జారీ చేసిన వాతావరణ శాఖ
తెలంగాణ వాసులు వాన కష్టాలు ఇప్పట్లో తీరేట్టు కనబడటం లేదు. మరిన్ని రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశముంది. ఈ మేరకు వాతావరణ శాఖ తాజాగా అలర్ట్ లు జారీ చేసింది.

heavy rains continue in telangana
Heavy Rains in Telangana: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తెలంగాణలో పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ (Hyderabad) సహా పలు జిల్లాల్లో గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. శుక్రవారం (Friday) కూడా రాష్ట్రవ్యాప్తంగా జోరు వానలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ (IMD Alert) పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ లు జారీ చేసింది.
ఆరెంజ్ అలెర్ట్ (Orange Alert) జిల్లాలు: ఆదిలాబాద్ జగిత్యాల్ కామారెడ్డి, కరీంనగర్, కొమురం భీం, మంచిర్యాల్, నిర్మల్, పెద్దపల్లి.. ఈ జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
ఎల్లో అలర్ట్ (Yellow Aert) జిల్లాలు: మహబూబ్ నగర్, మెదక్, మేడ్చల్- మల్కాజ్ గిరి నారాయణపేట, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్.. ఈ జిల్లాలో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కుండపోత వర్షాలు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో భారీగా వర్షపాతం నమోదైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 32.5, మహబూబాబాద్ జిల్లాలో 60.1, వరంగల్ జిల్లాలో 73.2, హన్మకొండ జిల్లాలో 29, జనగామ జిల్లాలో 91, ములుగు జిల్లాలో 43 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదయింది. అత్యధికంగా జనగామ జిల్లాలోని జాఫర్ ఘడ్ వద్ద 186.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయినట్టు జిల్లా అధికారులు తెలిపారు.
పలు గ్రామాలకు రాకపోకలు బంద్
మహబూబాబాద్ జిల్లాలో మున్నేరు, అకేరు, పాకాల వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. గార్ల సమీపంలో పాకల ఎరు చెక్ డ్యాం పై నుంచి వరద నీరు పొంగి ప్రవహిస్తుండడంతో రాంపురం, మద్దివంచ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని మొరంచవాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో అప్పయ్యపల్లి, సీతారంపురం, కొండాపురం, బంగ్లాపల్లి గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. హన్మకొండ జిల్లా నడికూడ మండలం కంఠాత్మకూర్ లోలేవల్ బ్రిడ్జిపై భారీగా వరద నీరు చేరడంతో.. పరకాల – అంబాల, హన్మకొండ మీదుగా రాకపోకలు స్తంభించడంతో సమీప గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు.
జనగామ జిల్లాలో జోరు వానలు
గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బచ్చన్నపేట మండలం కేశిరెడ్డి పల్లి గ్రామ చెరువు మత్తడి పోయటంతో రాకపోకలు బంద్ అయ్యాయి. వెంకిర్యాల గ్రామంలో రిజర్వాయర్ కెనాల్ తెగిపోవడంతో 350 ఎకరాల వరిపంట నీటమునిగింది. జనగామ మండలం గానుగుపహడ్ ఉదృతంగా ప్రవహించడంతో కల్వర్ట్ కొట్టుకుపోయింది. వడ్లకొండ ఏన చెరువు మత్తడి పడటంతో చీటకోడూరు రిజర్వాయర్ లోకి వరద నీరు భారీగా చేరుతోంది. సాయంత్రంలోగా రిజర్వాయర్ గేట్లను తెరిచేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రిజర్వాయర్ పరిసర ప్రాంతాల ప్రజలు వాగు వద్ద అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ శివ లింగయ్య కోరారు. చీటకోడూరు- యశ్వంతాపూర్ మధ్య వాగు వద్ద భద్రత ఏర్పాట్లు చేశారు.
Also Read: టెన్షన్ పెడుతున్న కడెం ప్రాజెక్టు.. గేట్లు తెరుచుకోకపోవడంతో ఆందోళన