తీవ్ర అల్పపీడనం : తెలంగాణాలో వర్షాలు కురిసే అవకాశం

Heavy Rains In Telangana For Two Days : తెలంగాణ రాష్ట్రంలో వరుణుడు ప్రతాపం చూపించాడు. విస్తారంగా వర్షాలు కురవడంతో వరదలు పోటెత్తాయి. ప్రధానంగా హైదరాబాద్ లో కుండపోతగా వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా వానలు కురవడంతో పలు కాలనీలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి.
మరోవైపు…మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న 24 గంటల్లో ఇది వాయవ్య దిశగా ప్రయాణించి తదుపరి 48 గంటల్లో ఒడిశా తీరానికి దగ్గరలో ఉన్న వాయవ్య బంగాళాఖాతం మీదుగా పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల వైపు ప్రయాణించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు పేర్కొంది.
https://10tv.in/heavy-rains-another-two-days/
దీని ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై ఉన్నట్లు వెల్లడించింది. రానున్న రెండ్రోజుల పాటు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.