శివరాత్రి స్పెషల్…వేములవాడకు హెలికాఫ్టర్ సేవలు

  • Published By: venkaiahnaidu ,Published On : February 20, 2020 / 03:59 PM IST
శివరాత్రి స్పెషల్…వేములవాడకు హెలికాఫ్టర్ సేవలు

Updated On : February 20, 2020 / 3:59 PM IST

శుక్రవారం(ఫిబ్రవరి-21,2020)మహాశివరాత్రిని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడకు హెలికాప్టర్‌ సేవలను ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ తెలంగాణ స్టేట్‌ ఏవియేషన్‌ కార్పొరేషన్‌ సహకారంతో ఈ సేవలను ప్రారంభించింది. బేగంపేట విమానాశ్రయంలో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ గురువారం(ఫిబ్రవరి-20,2020) హెలికాప్టర్‌ సేవలు ప్రారంభించారు. 

గురువారం(ఫిబ్రవరి-20,2020) నుంచి ఆదివారం(ఫిబ్రవరి 23,2020) వరకు హెలికాప్టర్‌ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. హెలికాప్టర్‌ సేవలు మొత్తం మూడు రకాల ప్యాకేజీలుగా ఉన్నాయి. ప్యాకేజీ-1లో భాగంగా వేములవాల నుంచి వ్యూ పాయింట్‌కు 7 నిమిషాల రైడ్‌కు టికెట్‌ ధర రూ.3 వేలు. ప్యాకేజీ-2లో వేములవాడ మిడ్‌మానేరు పరిసర ప్రాంతాలు తిలకించేందుకు రూ.5,500. కనీసం ఆరుగురు వ్యక్తులు ఉండాలి. 16 నిమిషాల విహంగ వీక్షణం. ప్యాకేజీ-3లో హైదరాబాద్‌ నుంచి వేములవాడకు తిరిగి హైదరాబాద్‌కు. టికెట్‌ ధర రూ. 30 వేలు. కనీసం ఐదుగురు వ్యక్తులు ఉండాలి. బుకింగ్‌ కొరకు 09400399999, 09880505905, 07994481767, 09544444693 నెంబర్లలో సంప్రదించవచ్చు.

 ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్‌ సూచనతో వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు ప్రారంభించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఆలయ పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. మిడ్‌మానేరును పర్యాటక హబ్‌గా చేసేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. భవిష్యత్‌లో ప్రధానాలయాలు, పర్యాటక ప్రాంతాలకు హెలికాప్టర్‌ సేవలు కొనసాగించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా మిడ్‌మానేరు నుంచి సిరిసిల్లకు బోటు సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.