High Court : ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ లేకపోయినా ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకోవాలి : హైకోర్టు
తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా జరిగిన విచారణలో పలు కీలక అంశాలపై వాదనలు జరిగాయి.

High Court Hearing On Corona Conditions In Telangana
High court hearing on corona conditions : తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా జరిగిన విచారణలో పలు కీలక అంశాలపై వాదనలు జరిగాయి. కరోనా కట్టడి కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.. రోజుకు ఎన్ని పరీక్షలు చేస్తున్నారు.. ఆసుపత్రుల్లో పరిస్థితి ఏంటి.. వలస కార్మికుల పునరావాసానికి ఏం చేస్తున్నారు.. లాంటి అనేక అంశాలను హైకోర్టు ప్రశ్నించింది.
ఆర్టీపీసీఆర్ టెస్టులు ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించింది. ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ లేకపోయినా ఆసుపత్రుల్లో అడ్మిట్ చేసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. కేసులు భారీగా నమోదవుతున్న యాదాద్రి భువనగిరి, నిర్మల్, జగిత్యాల, కామారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో టెస్టులు పెంచాలని ఆదేశించింది.
కోవిడ్ నియంత్రణ చేయడానికి ప్రత్యేక కమిటీ వేయాలని హైకోర్టు సూచించింది. నైట్ కర్ఫ్యూ విధించడం కాకుండా.. పగటిపూట ప్రజలు పబ్లిక్ ప్లేసుల్లో తిరగకుండా కట్టడి చేయాలని సూచించింది. ఎన్నికల సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకుండా ఆంక్షలు విధించాలని ఆదేశించింది. వైన్స్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు, సినిమా థియేటర్లు పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించింది.
ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని.. సరిహద్దుల్లో పటిష్ట చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. కుంభమేళాకు వెళ్లిన వారి వివరాలను నమోదు చేసి.. వారిని ప్రత్యేక క్వారంటైన్‌లో ఉంచాలని హైకోర్టు ఆదేశించింది.
ప్రతి ప్రభుత్వ హాస్పిటల్‌లో నోడల్ అధికారిని నియమించాలన్న హైకోర్టు.. RTCR టెస్ట్ రిపోర్టు 24 గంటల్లో ఇచ్చే విధంగా చూడాలని ఆదేశించింది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా చూడాలని సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా కంటైన్మెంట్ జోన్లు, మైక్రో కంటైన్మెంట్ జోన్ వివరాలు సమర్పించాలని ఆదేశించింది.
మరోవైపు.. రాష్ట్రంలో రెమిడెసివర్ కొరత ఉందని ప్రభుత్వం హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. దీంతో లక్షల్లో డిమాండ్ ఉంటే వేలల్లో రెమిడెసివర్ పంపించడమేంటని కేంద్రాన్ని ప్రశ్నించింది. దీనిపై పూర్తి సమాధానం చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది.