కూల్చివేతలపై హైడ్రాకు హైకోర్టు కీలక ఆదేశాలు..

ఉత్తర్వులు ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ వాదించారు.

కూల్చివేతలపై హైడ్రాకు హైకోర్టు కీలక ఆదేశాలు..

Hydra Demolitions : కత్వా చెరువులో హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి భవనాలు కూల్చొద్దని ఆదేశాలు ఇచ్చింది. కత్వా చెరువు పరిధిలో హైడ్రా కూల్చివేతలపై లక్ష్మీ శ్రీనివాస్ బిల్డర్ గుర్రం విజయలక్ష్మి హైకోర్టును ఆశ్రయించారు. కత్వా చెరువులో 170/4 సర్వే నంబర్ లో 15 విల్లాలు అక్రమంగా కూల్చారని రిట్ పిటిషన్ వేశారు. హైడ్రాతో పాటు కమిషనర్ రంగనాథ్ ను ప్రతివాదిగా చేర్చారు. అయితే, కత్వా చెరువు పరిధిలోని విల్లాలను కూల్చొద్దని కోర్టు గతంలోనే ఆర్డర్ ఇచ్చింది. న్యాయస్థానం ఉత్తర్వులను ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ వాదించారు. వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది.

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా దుండిగల్‌ మల్లంపేట్‌లోని కత్వా చెరువు బఫర్‌జోన్‌, ఎఫ్‌టీఎల్‌ ప్రాంతాలను ఆక్రమించి నిర్మించిన 15 విల్లాలను కొన్నిరోజుల క్రితం హైడ్రా అధికారులు నేలమట్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే, హైడ్రా అధికారుల తీరుపై బాధితులు తీవ్రంగా మండిపడుతున్నారు. చెరువు ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో నిర్మాణాలకు అధికారులు అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. విల్లాలను కూల్చేయడంతో తాము తీవ్రంగా నష్టపోయామని వాపోయారు. అన్ని అనుమతులు ఉన్నాయనే వాటిని కొనుగోలు చేశామంటున్నారు. మరిప్పుడు అక్రమ నిర్మాణాలు అంటూ కూల్చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నిలదీస్తున్నారు విల్లాల బాధితులు. అసలు చెరువు ఎఫ్ టీఎల్ లో నిర్మాణాలకు అధికారులు ఎలా అనుమతులు ఇచ్చారు? రిజిస్ట్రేషన్లు ఎలా చేశారు? బ్యాంకులు లోన్లు ఎందుకు ఇచ్చాయి? అని బాధితులు ప్రశ్నిస్తున్నారు.

కోటి రూపాయల నుంచి 2 కోట్ల రూపాయలు పెట్టి విల్లాలు కొన్నామని బాధితులు తెలిపారు. బిల్డర్ తో తమ డబ్బులు తమకు వెనక్కి ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే మరో ప్రాంతంలో తమకు ఇళ్లు ఇప్పించాలని కోరుతున్నారు.

 

Also Read : తీవ్ర ఆవేదనలో చొప్పదండి కాంగ్రెస్ సీనియర్ కార్యకర్తలు..! కారణం ఏంటంటే..