Gajwel KCR camp office : గజ్వేల్‌లో టెన్షన్.. టెన్షన్.. కేసీఆర్ ఆఫీస్ మీద దాడి.. సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
Telangana : గజ్వేల్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. గజ్వేల్‌లోని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ క్యాంప్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు హల్ చల్ చేశారు.
Gajwel KCR camp office Attack
- గజ్వేల్‌లో టెన్షన్ టెన్షన్
- కేసీఆర్ క్యాంప్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లిన కాంగ్రెస్ నేతలు
- కార్యాలయంపై దుండగులు దాడి
- తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన హరీశ్ రావు
Gajwel KCR camp office : గజ్వేల్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. గజ్వేల్‌లోని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ క్యాంప్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు హల్ చల్ చేశారు. సిద్ధిపేట జిల్లా డీసీసీ అధ్యక్షురాలు అంక్షరెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి ఫొటోతో కేసీఆర్ క్యాంప్ కార్యాలయంలోకి దూసుకెళ్లారు. అక్కడ కార్యాలయం గోడకు రేవంత్ ఫొటోను తగిలించారు. పెద్దెత్తున జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో కొందరు దుండగులు క్యాంప్ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. ఫర్నీచర్, కిటికీ అద్దాలు ధ్వంసం చేశారు.
Also Read : తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో ఇవాళ, రేపు ఈదురుగాలులతో భారీ వర్షాలు.. ఈ జాగ్రత్తలు పాటించాలి..
క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలే దాడికి పాల్పడ్డారని బీఆర్ఎస్ ఆరోపించింది. ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.భారీ సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఉద్రిక్తత పరిస్థితి నెలకొనడంతో పోలీసులు రంగంలోకిదిగి పరిస్థితిని అదుపు చేశారు. ప్రస్తుతం గజ్వేల్ లోని కేసీఆర్ క్యాంప్ కార్యాలయం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది.
గజ్వేల్‌లో కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ముమ్మాటికీ ఇది సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో జరిగిన దాడి.. ప్రజాస్వామ్యంపై సీఎం చేయించిన దాడి ఇది అంటూ హరీశ్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పట్టపగలు అధికార మదంతో విర్రవీగుతూ సోయి మరచి వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నాయకుల తీరు బీహార్ గ్యాంగ్‌ను తలపిస్తోందని అన్నారు. ఏకంగా ప్రజా ప్రతినిధుల క్యాంపు కార్యాలయాలపైనే ముప్పేట దాడులు చేస్తుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నట్లా లేనట్లా? అని హరీశ్ రావు ప్రశ్నించారు.
కాంగ్రెస్ పాలనలో ప్రజా ప్రతినిధులపై దాడులు, ప్రజా సంఘాలపై దాడులు, మీడియా పై దాడులు.. నిత్యకృత్యం కావడం సిగ్గుచేటు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు యంత్రాంగం కాంగ్రెస్ పార్టీకి ప్రైవేట్ సైన్యంలా మారిపోయారా? ఎందుకు అడ్డుకోవడం లేదు? అని హరీశ్ రావు ప్రశ్నించారు. ఒకవైపు “హేట్ స్పీచ్ బిల్” పేరుతో ప్రజలు, ప్రతిపక్షాల నోళ్లు మూయిస్తూ… మరోవైపు కాంగ్రెస్ గూండాలతో దాడులు చేయించడమేనా మీ ప్రజా పాలన? ఇందిరమ్మ రాజ్యం అని చెబుతూ… గూండా రాజ్యం అమలు చేస్తారా? అంటూ హరీవ్ రావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం, మంత్రులు ఇతర రాష్ట్రాల్లో పొలిటికల్ టూర్లు చేస్తూ… పాలనను గాలికి వదిలేశారా? ముఖ్యమంత్రి, మంత్రులు ఇతర రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో ఉంటే… ఇక్కడ పాలనను ఎవరు చూస్తారు? బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కార్యాలయాలపై దాడులు చేయాలని సందేశాలు ఇచ్చారా? కాంగ్రెస్ నాయకులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారా? ఏడవ గ్యారంటీగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని డబ్బా కొట్టి ఇప్పుడు, ఉన్న ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ఎమర్జెన్సీ పాలనను తలపిస్తున్నారని హరీశ్ రావు అన్నారు.
మీ అణచివేతలకు, మీ నిర్బంధాలకు, మీ దాడులకు బిఆర్ఎస్ పార్టీ అదరదు బెదరదు. ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని అడుగడుగునా నిలదీస్తూనే ఉంటం. ప్రజల తరఫున పోరాటం చేస్తూనే ఉంటం. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పై దాడులు జరిపిన కాంగ్రెస్ గూండాలను గుర్తించి వెంటనే అరెస్ట్ చేయాలని రాష్ట్ర డీజీపీని డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి దాడులు ఆపకపోతే… ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలే వీధుల్లోకి రావాల్సిన పరిస్థితి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త అని హరీశ్ రావు హెచ్చరించారు.
