ట్యాంక్ బండ్‎పై గణేశ్ నిమజ్జనాలు లేవు- హైదరాబాద్ సీపీ కీలక ప్రకటన

జీహెచ్ఎంసీ ప్రత్యేక కొలనులు ఏర్పాటు చేసిందని, అలాంటి విగ్రహాలను అక్కడే నిమజ్జనం చేయాలన్నారు.

ట్యాంక్ బండ్‎పై గణేశ్ నిమజ్జనాలు లేవు- హైదరాబాద్ సీపీ కీలక ప్రకటన

Updated On : September 13, 2024 / 8:26 PM IST

Ganesh Nimmajanam : తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు ట్యాంక్ బండ్ పై గణేశ్ నిమజ్జనాలు లేవన్నారు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ లోనే నిమజ్జన ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. నిమజ్జనం బందోబస్తులో 8వేల మంది పోలీసు సిబ్బంది పాల్గొంటారని, అన్ని శాఖల సమన్వయంతో ముందుకెళ్తున్నామని సీపీ ఆనంద్ తెలిపారు. గణేశ్ ఉత్సవ నిర్వహాకులు పోలీసులకు సహకరించాలని సీపీ కోరారు.

హైదరాబాద్ నగరంలో గణేశ్ నిమజ్జన వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఎప్పటిలాగే ఈసారి కూడా గణేశ్ నిమజ్జనానికి పోలీసులు భారీగా ఏర్పాట్లు చేశారు. వినాయక నిమజ్జనం నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. వినాయక నిమజ్జనానికి సంబంధించి తెలంగాణ హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగానే పోలీసు శాఖ ఏర్పాట్లు చేస్తోందన్నారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగానే ట్యాంక్ బండ్ మెయిన్ రోడ్ సమీపంలో గణేశ్ నిమజ్జన వేడుకలు జరగవన్నారు.

Also Read : ఆ ఆరుగురు అదృష్టవంతులు ఎవరు? మంత్రివర్గ విస్తరణకు సీఎం రేవంత్ కసరత్తు..

నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్ ప్రాంతాల్లో మాత్రం నిమజ్జనం యధావిధిగా జరుగుతుందన్నారు. పీవోపీ (ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్) విగ్రహాల నిమజ్జనానికి జీహెచ్ఎంసీ ప్రత్యేక కొలనులు ఏర్పాటు చేసిందని, అలాంటి విగ్రహాలను అక్కడే నిమజ్జనం చేయాలన్నారు. గణేశ్ నిమజ్జన వేడుకలకు భారీ బందోబస్తు కల్పిస్తున్నట్లు సీపీ వెల్లడించారు. ఇతర జిల్లాల నుంచి కూడా అదనపు బలగాలను రప్పిస్తామన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జన వేడుకలు జరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు.

జీహెచ్ఎంసీ అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ ఆంక్షలు, ఓల్డ్ సిటీ పరిసర ప్రాంతాల్లో బాలాపూర్ లడ్డూ వేలంకి సంబంధించి అధికారులతో సమన్వయం చేసుకుంటూ గణేశ్ నిమజ్జన వేడుకలు నిర్వహిస్తామని సీపీ తెలిపారు.