నిషేధం విధిస్తారా? హైదరాబాద్‌లో డీజేలు, టపాసుల మోతపై సీపీ కీలక సమావేశం..
హైదరాబాద్ నగరంలో ర్యాలీలు, పండుగలలో డీజేలతో పాటు టపాసుల వినియోగం ఏటేటా గణనీయంగా పెరిగిపోతోంది.

Dj Souns And Crackers Usage (Photo Credit : Google)
Dj Sounds And Crackers Usage : హైదరాబాద్ నగరంలో డీజేలు, టపాసుల వినియోగం తగ్గించేలా చర్యలు చేపడతామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ చెప్పారు. ర్యాలీల్లో డీజే, టపాసుల వాడకంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అధ్యక్షతన జరిగిన ఈ మీటింగ్ లో ఎమ్మెల్యేలు, మతపెద్దలు, పలువురు అధికారులు పాల్గొన్నారు. డీజే శబ్దాలపై భారీగా ఫిర్యాదులు వస్తున్నాయని, వృద్ధులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని సీపీ చెప్పారు. డీజే సౌండ్లు శ్రుతి మించుతున్నాయన్నారు. పబ్ లలో మాదిరిగా ర్యాలీలలో చేస్తున్నారని, వారిని కంట్రోల్ చేసేందుకు చర్యలు చేపడతామని కీలక వ్యాఖ్యలు చేశారు.
రోజురోజుకి పెరిగిపోతున్న డీజేలు, టపాసుల శబ్దాలను కంట్రోల్ చేసేందుకు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నడుం బిగించారు. మూడు కమిషనరేట్లకు సంబంధించి ఇవాళ రౌండ్ టేబుల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. వివిధ కమిషనరేట్ల పోలీసులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మత పెద్దలు సమావేశానికి వచ్చారు. వారి నుంచి కీలక సమాచారం తీసుకున్నారు. హైదరాబాద్ నగరంలో జరిగే రాజకీయ పార్టీల ర్యాలీలు కావొచ్చు, పండుగలు కావొచ్చు.. వ్యక్తులు పర్సనల్ గా జరుపుకునే ప్రోగ్సామ్స్ కావొచ్చు.. వీటిలో డీజేలతో పాటు పటాసుల వినియోగం ఏటేటా గణనీయంగా పెరిగిపోతోంది. రీసెంట్ గా గణేశ్ నిమజ్జన కార్యక్రమంలో పెద్దఎత్తున డీజేల వినియోగం జరిగింది. దీనిపై స్థానికుల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందినట్లుగా తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో రానున్న రోజుల్లో డీజే శబ్దాలతో పాటు టపాసుల వినియోగాన్ని కంట్రోల్ చేసేందుకు పోలీసు శాఖ నడుం బిగించింది.
డీజే శబ్దాలను కట్టడి చేసేందుకు హైదరాబాద్ పోలీసులు ఓ ప్రణాళికబద్దంగా ముందుకెళ్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ మూడు కమిషనరేట్లకు సంబంధించిన పోలీసు ఉన్నతాధికారులతో పాటు జీహెచ్ఎంసీ అధికారులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, మత పెద్దలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వివిధ వర్గాల నుంచి అనేక విజ్ఞప్తులు, ఫిర్యాదులు, విన్నపాలు అందాయి.
గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగరంలో నార్త్ ఇండియాకు సంబంధించిన కల్చర్ పెరిగిపోతోంది. సంప్రదాయ పద్ధతుల్లో నిర్వహించాల్సిన పండుగల్లో డీజేల వినియోగం పెరిగిపోతోంది. ఆగడాలు పెరిగిపోతున్నాయి. దీనిపై ఎక్కువ ఫిర్యాదులు అందాయి. గణేశ్ నిమజ్జన సమయంలో.. మండపం నుంచి నిమజ్జన ఘట్టానికి వెళ్లే ప్రాంతం వరకు కూడా డీజేల సౌండ్లు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిపై జీహెచ్ఎంసీ అధికారులకు, పోలీసులకు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో డీజే మోతలు, టపాసుల వినియోగం కట్టడికి పోలీసులు నడుంబిగించారు.
Also Read : రాజకీయ భవిష్యత్‌పై తీవ్ర ఆందోళనలో కాంగ్రెస్ సీనియర్ నేత? కారణం అదేనా..
అయితే, దీనిపై ఎమ్మెల్యే రాజాసింగ్ అభ్యంతరం తెలిపారు. హిందువుల పండుగల సందర్భాల్లోనే పోలీసులు ఆంక్షలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రౌండ్ టేబుల్ మీటింగ్ లో పాల్గొన్న రాజాసింగ్.. డీజేల వాడకంపై నిషేధం అంశాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తామన్న పరిస్థితి ఉంది. వాహనాలకు సంబంధించి ఏ విధంగా అయితే స్పీడ్ లిమిట్ ఉంటుందో.. అదే విధంగా డీజేల వినియోగానికి సంబంధించి కొంత లిమిట్ పెట్టాలి. అంతేకానీ నిషేధం విధిస్తే కుదరదన్నారు రాజాసింగ్. పోలీసులు హిందువుల పండుగలను టార్గెట్ చేస్తున్నారని.. అందులో భాగంగానే డీజేలు, టపాసుల వినియోగంపై నిషేధం పెట్టాలని చూస్తున్నారని రాజాసింగ్ మండిపడినట్లుగా తెలుస్తోంది. డీజే, టపాసుల వినియోగంపై పూర్తిగా నిషేధం విధించకుండా కొంత కట్టడి చర్యలు చేపట్టాలని సీపీ దృష్టికి రాజాసింగ్ తీసుకెళ్లినట్లు సమాచారం.