కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనలో ఆరుకు చేరిన మృతుల సంఖ్య.. కల్లులో క్లోరోఫామ్, యూరియా కలుపుతున్నట్లు గుర్తింపు..
హైదరాబాద్ కూకట్‌పల్లిలో కల్తీ కల్లు మహమ్మారి తీవ్ర విషాదం మిగిల్చింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. 40మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Adulterated Toddy Tragedy
Adulterated Toddy Tragedy: హైదరాబాద్ కూకట్‌పల్లిలో కల్తీ కల్లు మహమ్మారి తీవ్ర విషాదం మిగిల్చింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. 40మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఘటనపై ఎక్సైజ్, పోలీసు అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కల్తీ కల్లుకు పాల్పడిన ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని బాలానగర్ ఎక్సైజ్ పీఎస్‌లో విచారిస్తున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే బాలానగర్ ఎక్సైజ్ పీఎస్‌లో ఐదు, కూకట్‌పల్లి, కేపీహెచ్బీ పీఎస్‌లలో మూడు కేసులు నమోదయ్యాయి.
కల్తీ కల్లు తాగి ఇప్పటి వరకు ఆరుగురు మృతి చెందారు. వీరిలో సీతారామ్ (47), బొజ్జయ్య (55), నారాయణమ్మ (65), స్వరూప (61), మౌనిక (25), నారాయణ (42) ఉన్నారు. అయితే, వీరిలో ముగ్గురు మృతినే అధికారులు ధ్రువీకరించారు. కల్తీ కల్లు తాగిన 40 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎస్ రామకృష్ణ రావు ఆదేశించారు. ఇప్పటికే ఈ ఘటనలో ఏడుగురిపై కేసులు నమోదయ్యాయి. ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. కల్తీ కల్లు పై పూర్తి నివేదిక ఇవ్వాలని ఎక్సైజ్ శాఖ అధికారులను సీఎస్ ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.
కల్తీకల్లు బారిన పడినవారిలో 31మంది బాధితులు నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కల్తీ కల్లు కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.. వారి స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు. కల్లులో క్లోరోఫామ్, యూరియా కలుపుతున్నట్లు గుర్తించారు. ఇప్పటికే శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించగా.. ఇవాళ శాంపిల్స్ రిపోర్టు అధికారుల చేతికి చేరనుంది. రిపోర్టు వచ్చిన తరువాత అధికారులు బాధ్యులపై చర్యలు తీసుకోనున్నారు.
అసలేం జరిగిందంటే..
హైదరాబాద్‌లోని హైదర్‌నగర్, శంషిగూడ, నిజాంపేట, నడిగడ్డతండా, ఇందిరాహిల్స్, అడ్డగుట్ట తదితర ప్రాంతాలకు చెందిన రోజువారీ కూలీలు ఈ నెల 5, 6 తేదీల్లో హైదర్‌నగర్, ఇంద్రానగర్, భాగ్యనగర్ తదితర ప్రాంతాల్లోని కల్లు దుకాణాల్లో కల్లు తాగారు. వారిలో చాలామంది ఐదారు గంటల తర్వాత వాంతులు, విరేచనాలు, పొత్తికడుపులో నొప్పితో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితుల్లో ఎక్కువ మంది తరచూ కల్లు తాగేవారే కావడంతో వారి కుటుంబ సభ్యులు సాధారణ కడుపునొప్పిగానే భావించారు. అయితే, కొందరికి మూత్ర విసర్జన చేయడమూ కష్టమవడం, స్పృహతప్పి పడిపోవడంతో వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు. వీరిలో ఇప్పటి వరకు ఆరుగురు మరణించగా.. 40 మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.