hyderabad metro: మెట్రో రైల్ ప్రయాణికులకు భారీ షాక్.. రోజులో ఆరు గంటలు మాత్రమే రాయితీ..

మెట్రో రైల్ చార్జీలలో కార్డు, క్యూ ఆర్ కోడ్ ను ఉపయోగించి కొనుగోలు చేసే టికెట్లపై 10 శాతం రాయితీని ఎల్ అండ్ టి మెట్రో ఉపసంహరించింది.

hyderabad metro: మెట్రో రైల్ ప్రయాణికులకు భారీ షాక్.. రోజులో ఆరు గంటలు మాత్రమే రాయితీ..

Updated On : March 31, 2023 / 4:07 PM IST

Hyderabad Metro Rail: హైదరాబాద్ మెట్రో రైల్ ప్రయాణికులకు భారీ షాక్ తగిలింది. మెట్రో రైల్ చార్జీలలో కార్డు, క్యూ ఆర్ కోడ్ ను ఉపయోగించి కొనుగోలు చేసే టికెట్లపై 10 శాతం రాయితీని ఎల్ అండ్ టి మెట్రో ఉపసంహరించింది. రోజులో ఆరు గంటలు మాత్రమే 10 శాతం రాయితీ వర్తిస్తుందని మెలిక పెట్టింది. ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు.. సాయంత్రం 8 గంటల నుండి 12 గంటల వరకు మాత్రమే పది శాతం రాయితీ ఉంటుందని తెలిపింది. అంటే ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రాయితీ ఉండదు. ఏప్రిల్ 1 నుంచి అంటే రేపటి నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఈ మేరకు మెట్రో రైల్ ఎండీ కేవీబీ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటన చేశారు.

hyderabad metro rail
గతంలో ఉన్న సువర్ణ సేవర్ ఆఫర్ ఈ నెల 31 తో ముగుస్తుంది. ఇకపై సువర్ణ సేవర్ ఆఫర్ ఏప్రిల్ 1వ తేదీ నుంచి వచ్చే ఏడాది మార్చ్ 31 వరకు 99 రూపాయలుగా ఉండనుంది. ముందుగా సూచించిన హాలిడేస్ లలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఎన్నిసార్లు అయినా మెట్రోలో ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ఈ ఆఫర్ల ద్వారా మెట్రో ప్రయాణికులకు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉంటుందని కేవీబీ రెడ్డి తెలిపారు. జంట నగరాల్లో ప్రస్తుతం ప్రతిరోజు 4.4 లక్షల మంది మెట్రోలో ప్రయాణం చేస్తున్నారు.

hyderabad metro rail, smart card
కాగా,  స్మార్ట్ కార్డులపై 10 శాతం రాయితీ ఉపసంహరణతో ప్రయాణికులకు మెట్రో ప్రయాణం భారంగా మారనుంది. ముఖ్యంగా ప్రతిరోజు ప్రయాణం చేసే వారికి అదనపు భారం పడుతుంది. మెట్రోలో ప్రయాణించే వారిలో ఉద్యోగులు సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఉద్యోగులు కార్యాలయానికి వెళ్లి తిరిగి రావడానికి కనీసం 8 గంటల సమయం పడుతుంది. మెట్రో కార్డులను ఎక్కువగానే వినియోగించేది ఉద్యోగులే. ఇప్పుడు రాయితీని కొన్ని సమయాలకే పరిమితం చేయడం వల్ల ఉద్యోగులు నష్టపోయే అవకాశం ఉంది.

ప్రయాణం మరింత భారం..
ఆఫీస్ టైమింగ్స్ లోనే మెట్రోలో ఎక్కువ మంది ప్రయాణిస్తుంటారు. సాధారణంగా ఉదయం 9 నుంచి 11 గంటల సమయంలో మెట్రో రైళ్లు రద్దీగా ఉంటాయి. ఆఫీసుల నుంచి తిరిగి వచ్చేవారితో సాయంత్రం 6 నుంచి 8 గంటల సమయంలో మెట్రో రైళ్లు కిటకిటలాడుతుంటాయి. అలాంటి సమయంలో రాయితీని ఎత్తివేసి ప్రయాణికులు లేని సమయంలో రాయితీని కొనసాగించడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే వాహనాల పార్కింగ్, ఇంటి నుంచి మెట్రో స్టేషన్ కు రావడానికే ఎంతో బర్డెన్ అవుతోందని, రాయితీని ఎత్తివేయడం వల్ల మరింత భారం పడుతుందని ప్రయాణికులు వాపోతున్నారు.

Also Read: తెలంగాణ చరిత్రలోనే రికార్డ్, అత్యధిక విద్యుత్ వినియోగం.. కారణం అదేనా?