హైదరాబాద్‌లో కరోనా బాబా, మంత్రాలతో కొవిడ్ నయం చేస్తానంటూ ఒక్కొక్కరి నుంచి రూ.50వేలు వసూలు

  • Published By: naveen ,Published On : July 25, 2020 / 09:36 AM IST
హైదరాబాద్‌లో కరోనా బాబా, మంత్రాలతో కొవిడ్ నయం చేస్తానంటూ ఒక్కొక్కరి నుంచి రూ.50వేలు వసూలు

Updated On : July 25, 2020 / 12:59 PM IST

హైదరాబాద్ లో కరోనా బాబా వెలిశాడు. మాయలు, మంత్రాలు, శక్తులతోనే కరోనాను నయం చేస్తానని చెప్పి మోసానికి పాల్పడుతున్నాడు. ఒక్కో కరోనా బాధితుడి నుంచి రూ.40వేల నుంచి 50వేలు వసూలు చేశాడు. కరోనా బాబా లీలల గురించి సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. కరోనా బాబా స్థావరంపై దాడి చేశారు. హఫీజ్ పేట్ హనీఫ్ కాలనీలో ఈ ఘటన జరిగింది.

గత మార్చి నుంచి దందా, లక్షలు వసూలు:
మంత్రాలతో కరోనా నయం చేస్తానంటూ మోసాలకు పాల్పడుతున్నాడు కరోనా బాబా అలియాస్ బాబా ఇస్మాయిల్. మంత్రాలు, నిమ్మకాయలు, విబూదితో పూజలు చేసి అమాయకులను నమ్మించి మోసాలకు పాల్పడుతున్నాడు. గత మార్చి నుంచి దందాలు చేస్తున్నాడు. ఇప్పటివరకు బాధితుల నుంచి లక్షలు వసూలు చేశాడీ బురిడీ బాబా.

అతీతమైన శక్తులు ఉన్నాయంటూ శిష్యులతో ప్రచారం:
తనకు అతీతమైన శక్తులు ఉన్నాయంటూ శిష్యులతో ప్రచారం చేయిస్తున్నాడు కరోనా బాబా. మాస్క్ పెట్టుకోనక్కర్లేదని చెబుతాడు. తనకున్న అపూర్వ శక్తులతో కరోనా బారి నుంచి కాపాడతానని నమ్మబలికాడు. ఈ మాయ మాటలు నమ్మిన కొందరు బాబాను ఆశ్రయించారు. జలుబు, దగ్గు, సాధారణ జ్వరం ఉన్నా.. అది కరోనానే అంటూ అమాయకులను భయపెట్టి వారి నుంచి లక్షల రూపాయలు దండుకున్నాడు ఇస్మాయిల్. సుమారు 70మంది బాధితులు కరోనా బాబా చేతిలో మోసపోయినట్టు పోలీసులు గుర్తించారు. కరోనా లక్షణాలు కనిపిస్తే ఆసుపత్రికి వెళ్లాలని పోలీసులు సూచించారు. అంతేకానీ మోసాలకు పాల్పడే ఇలాంటి దొంగ, బురిడీ బాబాలను నమ్మొద్దన్నారు. ఇలాంటి వారి గురించి తెలిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలన్నారు.

”ఇస్మాయిల్ బాబా మియాపూర్ లో తాయత్తులు కడుతుంటాడు. సడెన్ గా కరోనా బాబా అవతారం ఎత్తాడు. మాయలు, మంత్రాలతో కరోనా నయం చేస్తానని నమ్మించాడు. కొంతమంది నుంచి రూ.40వేలు, 50వేలు, 12వేలు వసూలు చేశాడు. హఫీజ్ పేట్ హనీఫ్ కాలనీలో ఇస్మాయిల్ బాబాను అరెస్ట్ చేశాం. ఇస్మాయిల్ బాబాపై కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టాం” అని పోలీసులు తెలిపారు.

మంత్రాలకు చింతకాయలు రాలవు:
మందు లేని కరోనా వైరస్ ధాటికి ప్రజలు ప్రాణ భయంతో వణికిపోతున్నారు. కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. ప్రజల్లో ఉన్న కరోనా భయాన్ని కొందరు కేటుగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. బాబా అవతారవం ఎత్తి వారి బలహీనతను సొమ్ము చేసుకుంటున్నారు. మందులు, వ్యాక్సిన్ అవసరం లేకుండానే కరోనా నయం చేస్తామని చెప్పి అమాయకులను దండుకుంటున్నారు. కొందరు అమాయకులు బాబాలను నమ్మి అడ్డంగా మోసపోతున్నారు. మంత్రాలకు చింతకాయలు రాలవనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.